నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎస్ఎల్వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ‘ది ప్యారడైజ్’ సినిమాను వీక్షించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్లో (Sudarshan 35MM Theatre) రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి సినిమాను చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
— KTR (@KTRBRS) September 26, 2026
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…
అస్తిత్వం, అణిచివేతపై పోరాటం.. కేటీఆర్ ప్రశంసలు
‘ది ప్యారడైజ్’లో అస్తిత్వం కోసం జరిగే పోరాటాన్ని, అణిచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటును చూపించిన తీరును కేటీఆర్ ప్రశంసించారు. సందర్భం వచ్చినప్పుడు గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారతాయనే సందేశాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను అభినందించారు. అలాగే కథానాయకుడి పాత్రలో నాని అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు.
నటుడు ప్రియదర్శికి (Priyadarshi) కూడా కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా!! You know who that is” అంటూ తన పోస్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను(KCR) పోలినట్లుగా కనిపించే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో థియేటర్లో అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆ సమయంలో కేటీఆర్ చిరునవ్వు చిందించడం కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
సినిమా ప్రదర్శన అనంతరం థియేటర్ బయట కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఓ నాయకుడు ముందుకొచ్చి పోరాటం చేసి ఆ సమాజానికి గుర్తింపు తీసుకొచ్చే కథగా ‘ది ప్యారడైజ్’ను అభివర్ణించారు. తెలంగాణ నేపథ్యంతో పాటు యాస, భాషను సినిమాలో ఉపయోగించిన విధానం తనను ఆకట్టుకుందని తెలిపారు.







