గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై (Village and Ward Secretariat Employees) ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆ సంఘం నేత మధుబాబు (Madhubabu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ఉద్యోగులపై సస్పెన్షన్లు, కేసులు పెట్టడం సరికాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే ఉద్యోగులపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకుని, నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులపై చర్యల ప్రభుత్వానికి మధుబాబు డెడ్లైన్ విధించారు. అక్టోబర్ 2లోపు ఉద్యోగులపై ఉన్న కేసులు, సస్పెన్షన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అప్పటిలోగా సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ 3 నుంచి శ్రీకాకుళంలో(Srikakulam) ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఉద్యోగుల హక్కుల కోసం, ఉద్యమంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోనని తెలిపారు.
మహిళా ఉద్యోగులను (Women Employees) ఇబ్బందులకు గురిచేసిన వారిపై కూడా మధుబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదిలా ఉండగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’ (Chalo Vijayawada) కార్యక్రమంపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న విజయవాడలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కార్యాలయం జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి అనుమతి లేని ధర్నాలో పాల్గొన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ వివరాలను సేకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ల సూచనల మేరకు జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఎంపీడీవోలు(MPDOs), మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioners) నుంచి మండలాలు, పట్టణాల వారీగా ఉద్యోగుల వివరాలను సేకరించారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులపై ఇప్పటికే కేసులు, సస్పెన్షన్లు వంటి చర్యలు కొనసాగుతుండగా.. తాజాగా ధర్నాలో పాల్గొన్న వారి వివరాలను సేకరించాలన్న ఆదేశాలు మరింత చర్చకు దారితీశాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని మధుబాబు డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.





