‘వీఆర్కే డైట్’(VRK Diet), ‘వీరమాచినేని డైట్’(Veeramachineni Diet) పేర్లతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వీరమాచినేని రామకృష్ణపై (Veeramachineni Ramakrishna) సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు చేశారు. రాయదుర్గంలోని వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ (VRK Health Care Centre) వ్యవస్థాపకుడైన ఆయన.. కొవ్వు, ప్రొటీన్ ఆధారిత ఆహారంతో అనారోగ్యాలను నయం చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు నమోదైంది.
నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల న్యాయవిద్యార్థి (Law Student) సోషల్ మీడియాలో వీరమాచినేని రామకృష్ణకు సంబంధించిన వీడియోలు, ప్రకటనలు చూసి ఆయనను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతూ ఇన్సులిన్ (Insulin) తీసుకుంటున్న అతడికి.. రామకృష్ణ(Ramakrishna), కోటేశ్వరరావు (Koteswara Rao) కలిసి డయాబెటిస్‌ను నయం చేస్తామని చెప్పి కొన్ని ఆరోగ్య సూచనలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు వాడకూడదని, తాము సూచించిన విధానాన్నే పాటించాలని సూచించినట్లు, ఇందుకు రూ.26 వేలు ఫీజుగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 12న సూచించిన డైట్‌ను ప్రారంభించిన న్యాయవిద్యార్థి.. రెండు రోజులకే తీవ్ర డీహైడ్రేషన్‌కు (Severe Dehydration) గురై అస్వస్థతకు లోనైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కోసం రూ.58 వేలకు పైగా ఖర్చయినట్లు బాధితుడు తెలిపాడు. తనకు ఎదురైన అనారోగ్య పరిస్థితికి వీరమాచినేని రామకృష్ణ సూచించిన ఆరోగ్య చిట్కాలే కారణమని ఆరోపిస్తూ ఈ నెల 24న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు, సోషల్ మీడియా వేదికగా ‘వీఆర్కే డైట్’(VRK Diet) పేరుతో అనధికార వైద్య సలహాలు ఇస్తున్నారని, అల్లోపతి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసు కూడా కోర్టులో విచారణలో ఉంది.
ఈ కేసు విచారణను సిటీ సివిల్ కోర్టు నవంబర్ 25కు వాయిదా వేసింది. ఈ క్రమంలో వీరమాచినేని రామకృష్ణకు సమన్లు జారీ చేసింది.








