దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం (Flydubai Flight) FZ1073లో చోటుచేసుకున్న ఘటనలో భారతీయ పైలట్ (Indian Pilot) కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Captain Smith Machar) ప్రదర్శించిన అసాధారణ ధైర్యంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 30న దుబాయ్ (Dubai) నుంచి బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో (Boeing 737 MAX 8) కాక్‌పిట్‌లో సహ పైలట్‌తో జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చినట్లు సమాచారం. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి జరిగినట్లు, విమానాన్ని ఉగ్ర దాడి తరహాలో ప్రమాదానికి గురిచేసే ప్రయత్నం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సమయంలో విమానం దాదాపు రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల మేర అకస్మాత్తుగా కిందకు పడిపోయినట్లు విమాన డేటా సూచించింది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అప్రమత్తంగా వ్యవహరించి కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని(Saudi Arabia) టబుక్ విమానాశ్రయంలో(Tabuk Airport) అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు సహ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు.
174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను పలువురు నాయకులు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందించారు.
“174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు సెల్యూట్. తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల భద్రత పట్ల తన బాధ్యతలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన నిలిచారు. ఆయన భారతదేశానికి గర్వకారణం. ధైర్యం, నిస్వార్థ సేవ అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నిజమైన హీరో” అని జగన్ పేర్కొన్నారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించి పెను ప్రమాదాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.





