ఆసియా క్రీడలు (Asian Games) 2026లో భారత బాక్సర్లు (India Boxers) అదరగొడుతున్నారు. పురుషుల 80 కేజీల విభాగంలో హర్యానాకు (Haryana) చెందిన 21 ఏళ్ల అంకుశ్ పంఘల్ (Ankush Panghal) సత్తా చాటి స్వర్ణ పతకం (Gold Medal) సాధించాడు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో పురుషుల బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు.
పురుషుల 80 కేజీల ఫైనల్లో దక్షిణ కొరియాకు (South Korea) చెందిన మిన్సోంగ్ కిమ్‌తో(Minsong Kim) అంకుశ్ తలపడ్డాడు. మొదటి రౌండ్ నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన అతడు 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి రౌండ్లో 4-1తో పైచేయి సాధించిన అంకుశ్.. ఆ తర్వాతి రౌండ్లలోనూ అదే జోరును కొనసాగించాడు.
అంతర్జాతీయ స్థాయిలో అంకుశ్‌కు ఇది మరో ప్రతిష్టాత్మక విజయం. తన అరంగేట్ర కామన్వెల్త్ క్రీడల్లోనే స్వర్ణ పతకం సాధించిన అతడు.. ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకాన్ని అందుకున్నాడు. పురుషుల బాక్సింగ్‌లో అంకుశ్ స్వర్ణానికి ముందు భారత్ రెండు కాంస్య పతకాలను మాత్రమే సాధించింది.
మహిళల బాక్సింగ్‌లోనూ (Women’s Boxing) భారత బాక్సర్లు మెరిశారు. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్, 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళా బాక్సర్లలో మేరీ కోమ్ సరసన వీరిద్దరూ నిలిచారు.
తన పుట్టినరోజున బరిలోకి దిగిన లవ్లీనా బోర్గోహెయిన్.. చైనాకు చెందిన జియి బావోపై 5-0తో విజయం సాధించింది. గత ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతకాన్ని ఈసారి స్వర్ణంగా మార్చుకుంది.
మహిళల 65 కేజీల ఫైనల్లో పర్వీన్ హూడా.. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత చెన్ నియెన్-చిన్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పర్వీన్ తొలిసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందుకుంది.
అంకుశ్ పంఘల్, లవ్లీనా బోర్గోహెయిన్, పర్వీన్ హూడా సాధించిన స్వర్ణాలతో ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్ జట్టు సత్తా మరోసారి ప్రపంచానికి చాటుకుంది. వరుస విజయాలతో భారత పతకాల ఖాతాలో మరిన్ని పసిడి మెరుపులు చేరాయి.







