రాయలసీమలో(Rayalaseema) కరువు పరిస్థితులు (Drought Conditions) తీవ్రంగా ఉన్న వేళ.. ప్రభుత్వం(Government) ప్రకటించిన రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్‌పై(Horticulture Hub) రైతులు (Farmers) ప్రశ్నలు సంధించారు. ఎండిపోయిన పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఒకవైపు పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు ‘రాయలసీమ రైజింగ్’(Rayalaseema Rising) పేరుతో భారీ పెట్టుబడుల ప్రకటనలు చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా(Drought-Affected Areas) ప్రభుత్వం ప్రకటించగా, వాటిలో 186 ఈ ప్రాంతంలోనే ఉన్నాయని, తీవ్ర కరువు ఉన్న 283 మండలాల్లో 159 మండలాలు కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పుకొచ్చారు. జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 53.4 శాతం వర్షపాతం లోటు(Rainfall Deficit) నమోదైనట్లు ప్రభుత్వం కూడా వెల్లడించిందని గుర్తు చేస్తున్నారు.
రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వ వర్షపాతం గణాంకాల ప్రకారం అక్టోబర్ 3 నాటికి అన్నమయ్య జిల్లాలో 63.2 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 58.5 శాతం, చిత్తూరులో 47.2 శాతం, వైఎస్సార్ కడపలో 49.4 శాతం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 45.5 శాతం లోటు నమోదైందని ఈ పరిస్థితుల్లో బోర్లు ఎండిపోవడం, మామిడి, నిమ్మ తదితర ఉద్యాన పంటలు దెబ్బతినడం, సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. టమాటా, మిరప, ఉల్లి, అరటి, నిమ్మ, మామిడి వంటి పంటలకు గిట్టుబాటు ధరలు(Remunerative Prices) లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపధ్యంలో “పంటలు ఎండిపోతుంటే రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఎక్కడ?” అంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరువు పరిస్థితులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టడంతో పాటు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ(Input Subsidy), పంటల బీమా(Crop Insurance, పశుగ్రాసం(Fodder) వంటి సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
కరువు మండలాలను పునఃసమీక్షించి, పంట రుణాలను పునఃప్రణాళిక చేయాలని, రైతులకు సమగ్ర కరువు సహాయక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రస్తుతం ఎండిపోతున్న పొలాల్లో రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.





