హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ(Three Formats Captaincy) నుంచి తప్పుకున్న నేపథ్యంలో భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ రేసులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు జట్టు పగ్గాలు అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆసియా గేమ్స్ 2026లో(Asian Games 2026) భారత మహిళల జట్టు స్వర్ణం సాధించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. 2012 నుంచి జట్టుకు నాయకత్వం వహించిన ఆమె సుదీర్ఘ కెప్టెన్సీకి ముగింపు పలికారు.
హర్మన్‌ప్రీత్‌కు డిప్యూటీగా ఉన్న మంధాన.. కెప్టెన్ (Captain) అందుబాటులో లేని సమయంలో పలుమార్లు జట్టును నడిపించారు. దీంతో నాయకత్వంపై ఆమెకు మంచి అనుభవం ఉంది. జింబాబ్వేతో(Zimbabwe) జరగనున్న 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో మంధానను కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
2024-25 మధ్య మంధాన 4 వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా.. అన్నింటిలోనూ భారత్ విజయం సాధించింది. టీ20ల్లో హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో 18 మ్యాచ్‌లకు సారథ్యం వహించి.. పూర్తయిన 17 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 6 ఓటములు నమోదు చేశారు.
తదుపరి ప్రపంచకప్‌తో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని మంధాన చుట్టూ జట్టును నిర్మించాలని బీసీసీఐ(BCCI) భావిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ అనుభవం, స్థిరమైన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ అనుభవం ఉండటంతో హర్మన్‌ప్రీత్ తర్వాత మంధానకే బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.







