ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేసేలా Oracle Corporation 2026లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు (Layoffs) చేపట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 18% వరకు ఉంటుందని అంచనా. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో వేలాది మంది ఉద్యోగులకు ఈమెయిళ్ల (Emails) ద్వారా ఉద్యోగాల రద్దు సమాచారం చేరడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
భారత నగరాలపై తీవ్ర ప్రభావం
ఈ తొలగింపులు హెల్త్ (Health), సేల్స్ (Sales), క్లౌడ్ (Cloud), కస్టమర్ సక్సెస్ (Customer Success), నెట్సూట్ (NetSuite) వంటి కీలక విభాగాలను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా పూణే(Pune), హైదరాబాద్ (Hyderabad) నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఒక సీనియర్ ఐటీ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం, సాధారణంగా లాగిన్ అయ్యే సమయంలో సిస్టమ్ యాక్సెస్ నిలిపివేయబడిందని, తరువాత ఈమెయిల్ ద్వారా ఉద్యోగం కోల్పోయినట్లు తెలిసిందని చెప్పారు. కంపెనీ నుంచి 1 నెల జీతం పాటు 2 నెలల అదనపు పరిహారం ఇచ్చినట్లు సమాచారం.
ఇంకొక ఉద్యోగి ఇటీవల గృహ రుణం తీసుకున్నానని, ఇప్పుడు ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు వంటి అంశాలు తమపై భారంగా మారాయని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన మరో ఉద్యోగి 10 సంవత్సరాల సేవ చేసినప్పటికీ తన పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా తొలగించడం బాధ కలిగించిందన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐటీ రంగంలో సాధారణంగా ప్రతి ఏడాది 4% నుండి 5% వరకు ఉద్యోగ కోతలు జరుగుతాయి. అయితే ఈసారి తీసుకున్న నిర్ణయం భారీదిగా భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అలాగే AI వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణాలుగా చెబుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద ఉద్యోగ కోతగా భావిస్తున్నారు. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






