ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి దిశలో కొత్త ఆలోచనలు, కొత్త నమూనాలు అవసరమవుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష నేత జగన్ (Jagan) ప్రతిపాదించిన ‘మావిగన్’ (MAVIGAN) (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్ ఒక కీలక చర్చకు దారితీసింది. ఒకే నగరంపై ఆధారపడిన అభివృద్ధి నమూనాల కంటే, ప్రాంతీయ సమతౌల్యాన్ని పెంపొందించే విధంగా రూపొందించిన ఈ ప్రణాళికలో ఆర్థిక, చారిత్రక, వ్యూహాత్మక అంశాలు సమన్వయమై ఉన్నాయనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
మావిగన్ అనేది మూడు కీలక నగరాలైన మచిలీపట్నం (Machilipatnam)–విజయవాడ (Vijayawada)–గుంటూరులను (Guntur) అనుసంధానిస్తూ రూపొందించిన ఒక ఆర్థిక కారిడార్ (Economic Corridor). ఈ మూడు నగరాలు ఇప్పటికే వాణిజ్యం, రవాణా, వ్యవసాయం, విద్య రంగాలలో ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. వీటిని ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ వృద్ధిని వేగవంతం చేయడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ఈ కారిడార్ ద్వారా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, ఐటీ మరియు సేవా రంగ విస్తరణ వంటి అనేక రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కారిడార్ నమూనాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో శతాబ్దాల నిశ్శబ్దం తర్వాత… మచిలీపట్నం పేరు మళ్ళీ వినపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మచిలీపట్నం ఒకప్పుడు ముఖ్యమైన సముద్ర వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి విలువైన రత్నాలు, అద్భుతమైన వస్త్రాలు ప్రపంచమంతటికి చేరేవి.
పురాతన కాలంలోనే మచిలీపట్నం భారత మహాసముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించింది. ప్రాచీన కాలంలోనే ఇది అంతర్జాతీయ వ్యాపారానికి గేట్వేగా నిలిచింది. ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ’ (Periplus of the Erythraean Sea) వంటి గ్రంథాలు, 2వ శతాబ్దం గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టోలెమీ రచనలు మచిలీపట్నం ప్రాముఖ్యతను ప్రస్తావించాయి. ఈ ప్రాంతం నుండి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, ముఖ్యంగా నూలు వస్త్రాలు (ముస్లిన్) ఎగుమతి అయ్యేవి. “ముస్లిన్” అనే పేరు కూడా మచిలీపట్నం నుంచే ఉద్భవించిందని భావిస్తారు. ఇది ఆంధ్ర సామ్రాజ్యంలోనే అతిపెద్ద మరియు ముఖ్యమైన మార్కెట్‌గా ఉండేదని చరిత్ర చెబుతుంది.
మధ్యయుగ కాలంలో ఈ పోర్ట్ అత్యున్నత స్థాయికి చేరింది. ఇది బహ్మనీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు వంటి రాజవంశాల ఆధీనంలోకి మారుతూ వచ్చింది. గోల్కొండ వజ్రాలు, కలంకారి వస్త్రాలు ఇక్కడి నుంచి ప్రపంచానికి వెళ్లేవి.
17వ శతాబ్దంలో యూరోపియన్ శక్తులు ఇక్కడికి వచ్చాయి. 1611లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ మొదటి ఫ్యాక్టరీ స్థాపించింది. బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ మధ్య పోటీ పెరిగింది. చివరకు 1759లో బ్రిటిష్ ఆధిపత్యం సాధించారు. బొంబాయి రైల్వే మార్గం నిర్మించే వరకు, దక్కన్ ప్రాంతానికి సరుకులను దిగుమతి చేసుకోవడానికి ఇది ప్రధాన రేవు పట్టణంగా పనిచేసింది. 17వ శతాబ్దపు ప్రయాణికుడు టావెర్నియర్ ప్రకారం, ఈ ప్రాంతం బ్రష్‌తో చేతితో చిత్రించిన వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వస్త్రాల నాణ్యత చాలా గొప్పదిగా ఉండేదని, వీటికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉండేదని ఆయన పేర్కొన్నారు.
19వ శతాబ్దంలో మచిలీపట్నం క్షీణత మొదలైంది. చెన్నై (మద్రాస్) పోర్ట్ అభివృద్ధి కృష్ణా నది మార్గం మారడం వల్ల మట్టి పేరుకుపోవడం పెద్ద నౌకలకు అనుకూలంగా లేకపోవడం 1864లో వచ్చిన భారీ తుఫాను ఈ నగరానికి తుదిప్రహారం ఇచ్చింది. నాటి తుఫాన్ లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత మచిలీపట్నం ప్రాముఖ్యత కోల్పోయింది. 1970 వరకు కార్యకలాపాలు కొనసాగించిన బందరు పోర్టు కాలక్రమంలో కనుమరుగైపోయింది.
రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘ తీరప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికంగా, వాణిజ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పంలో భాగంగా ప్రజల చిరకాల కోరిక అయిన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి 2023లో శ్రీకారం చుట్టారు. దీంతో మచిలీపట్నానికి పూర్వ వైభగం దిశగా అడుగులుపడ్డాయి. అయితే అక్కడితో ఆగకుండా చరిత్ర కలిగిన ఈ నగరాన్ని మరింత ముందుకు నడిపించేలా మావిగన్ (మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు) కాపిటల్ కారిడార్ ప్రణాళికను ప్రకటించి నగరానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా తన విజన్ ను ప్రకటించారు జగన్.
ప్రతిపక్షనేత జగన్ ప్రకటనతో ఒకప్పుడు దేశంలోనే ముఖ్యమైన నగరంగా, అంతర్జాతీయ వ్యాపారానికి గేట్వేగా వెలుగోంది కాలక్రమేనా మరుగునపడిపోయిన ఈ పురాతన రేవు నగరం మరో సారి తన వైభవాన్ని చూడబోతుందనే అభిప్రాయం తెలుగునాట చర్చనీయంశగా మారింది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారం పడకుండా అతి కొద్ది కాలంలోనే రాజధానిగా వెలుగొందగల సత్తా మావిగన్ కారిడార్ కు ఉందని నిపుణులుసైతం చెబుతున్న మాట.






