---Advertisement---

గుంటూరు కమిషనర్ కార్యాలయంలో టీడీపీ నేత దౌర్జన్యం

May 26, 2026

---Advertisement---

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ మయూర్ అశోక్ (ఐ.ఏ.యస్) కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు తన అనుచరులతో కలిసి కమిషనర్ ఛాంబర్‌లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. కమిషనర్ ముఖ్య సమావేశంలో ఉన్నారని సిబ్బంది తెలిపినా, అమృతరావు మరియు ఆయన అనుచరులు ఆగ్రహంతో కార్యాలయంలో హంగామా సృష్టించినట్లు సమాచారం. సిబ్బందిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా, కమిషనర్‌ను సైతం బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమాచారం అందుకున్న లాలాపేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా, వారు మాట వినలేదని తెలుస్తోంది. జీఎంసీ మేనేజర్ బాలాజీ బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

టెండర్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో 69 మంది గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్ చేయాలని కమిషనర్ ప్రభుత్వం వద్దకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో రాయపాటి అమృతరావు పేరు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో 146 టెండర్లను అధికారులు రద్దు చేసి, రీటెండర్లకు సిద్ధమవ్వడం ఈ వివాదానికి కారణమై ఉండొచ్చనే చర్చ సాగుతోంది.

ఇక దీనికి ముందు ఇంజినీరింగ్ విభాగంలో అమృతరావు అద్దాలు ధ్వంసం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే రెండు నెలల క్రితం మేయర్ ఛాంబర్‌లో ఎస్ఈపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలో కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వేధింపులు తట్టుకోలేక సంబంధిత అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి ఘటనలో కూడా అమృతరావు పేరు బలంగా వినిపించింది.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, అధికార పార్టీ అండతో కొందరు నాయకులు అధికారులను, ప్రజలను బెదిరిస్తూ వ్యవహరిస్తున్నారనే భావన పెరుగుతోందని అంటున్నారు. “అధికారంలో ఉన్నామనే అహంకారంతో గల్లీ స్థాయి నేతలు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు” అంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment