కేరళ (Kerala), అస్సాం(Assam), పుదుచ్చేరిలో (Puducherry) ఎన్నికల పోలింగ్ (Election Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్లో ప్రజలు భారీగా పాల్గొంటున్నారు. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం విశేషం.
ఉదయం 11 గంటల వరకు అస్సాంలో 38.92 శాతం, కేరళలో 32.28 శాతం, పుదుచ్చేరిలో 37.06 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. క్యూలో ఉన్న ఓటర్లకు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు.
కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan), సినీ ప్రముఖులు మోహన్ లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty), కేంద్ర మంత్రి సురేష్ గోపి (Suresh Gopi) సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ (Himanta Biswa Sarma) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి బైక్పై వెళ్లి ఓటు వేసి ప్రత్యేకంగా నిలిచారు.
దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు 3 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుండగా, తదుపరి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 2వ విడతగా 142 స్థానాలకు ఏప్రిల్ 29న ఓటింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడించనున్నారు.






