అమెరికా (America) రాజకీయ వర్గాలను కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. వర్జీనియా (Virginia మాజీ ఉప గవర్నర్ (Lieutenant Governor) జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (Justin Fairfax) తన భార్యను కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వాషింగ్టన్ (Washington) శివారు ప్రాంతమైన అన్నందలేలో గురువారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, జస్టిన్ తన భార్య డాక్టర్ సెరీనా ఫెయిర్‌ఫాక్స్‌ను (Serene Fairfax) ఇంటి దిగువ అంతస్తులో కాల్చి చంపాడు. ఆ తర్వాత పై అంతస్తులోని గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ దృశ్యాలను చూసిన వారి కుమారుడు అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
2017లో ఉప గవర్నర్‌గా ఎన్నికైన జస్టిన్ భవిష్యత్తులో గవర్నర్ (Governor) అవుతాడని అప్పట్లో భావించారు. అయితే 2019లో ఇద్దరు మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు (Sexual Misconduct Allegations) చేయడంతో రాజకీయ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఆరోపణలను ఖండించినప్పటికీ ఆయన రాజకీయంగా ఒంటరిగా మారిపోయాడు.
2021 గవర్నర్ ఎన్నికల్లో కూడా ఓటమి ఎదురవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు కూడా ఆయనను మానసికంగా కుంగదీసినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆయన భార్య విడాకుల కోసం దరఖాస్తు చేయడంతో కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయి.
కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏప్రిల్ చివరినాటికి ఇంటిని ఖాళీ చేయాలని జస్టిన్‌కు సూచించినట్లు సమాచారం. ఆ గడువు ముగియకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
ఈ ఘటనపై వర్జీనియా రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. గృహ హింస ఏ కుటుంబంలోనైనా జరగవచ్చని, మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని నాయకులు పేర్కొన్నారు.






