తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ఈసారి భారీ ట్విస్ట్ కనిపిస్తోంది. ఎప్పటిలాగే పాత పార్టీలే గెలుస్తాయనుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ, నటుడు విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) దూసుకుపోతోంది. వస్తున్న ట్రెండ్స్‌ను చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైనట్టే కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
చెన్నై(Chennai) నగరాన్ని తప్పించి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాలతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ (M.K. Stalin) తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో వెనుకంజలో ఉండటం డీఎంకే శ్రేణులకు షాక్ ఇస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకే ప్రస్తుతం 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా కొద్దిపాటి మద్దతు అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, పీఎంకే, సీపీఐ పార్టీల మద్దతు కోసం విజయ్ ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీలు కలిపి సుమారు 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఇక అన్నాడీఎంకే (AIADMK)తో కలిసి అధికారాన్ని పంచుకోవడంపై విజయ్ ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు ఎలా రూపుదిద్దుకుంటాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రానికల్లా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.






