జేమ్స్ కేమెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ 3’ (Avatar 3) ఫైనల్‌గా ఓటీటీలోకి(OTT) రానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, విజువల్స్ మరియు పండోరా ప్రపంచం మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ (Disney Plus) జూన్ 24 నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇకపై సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఫ్రీగా వీక్షించే అవకాశం పొందనున్నారు.
ఇక ఇండియాలో కూడా అదే తేదీన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ద్వారా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళం సహా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే భారతీయ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, పండోరా ప్రపంచంలోని మాయాజాలాన్ని మరోసారి ఇంట్లోనే ఆస్వాదించేందుకు సినీ అభిమానులు సిద్ధమవుతున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ విజువల్ స్పెక్టకిల్‌ను ఎంజాయ్ చేయొచ్చు.






