ఏపీ అసెంబ్లీ (Andhra Pradesh Legislative Assembly) ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం (Justice) కోసం వచ్చిన తల్లిదండ్రులను (Parents) పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో అక్కడికి వచ్చిన చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులను తీసుకెళ్తుండగా చిన్నపిల్లలు పోలీసులను వేడుకుంటూ కనిపించడం హృదయ విదారకంగా మారింది. కొంతమంది చిన్నారులు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
అసలు ఘటన ఏమిటంటే
ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ (Sri Chaitanya Navodaya Coaching Center)లో తౌషిక్ (Toushik) అనే విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపిస్తూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ కుమారుడు కేవలం కొద్దిసేపటి ముందు వరకు నవ్వుతూ మాట్లాడాడని, అతన్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, పోలీసులు కలిసి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు. శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
తల్లిదండ్రులకు స్థానికుల మద్దతు
అసెంబ్లీ ప్రాంతంలో ఆందోళనకు అనుమతి లేకపోవడంతో పోలీసులు తౌషిక్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఆ తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. కొడుకును కోల్పోయిన ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాలని పోలీసులను, ప్రజాప్రతినిధులను కోరారు. ఈ ఘటనపై రాజకీయ నాయకులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






