ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలిలో (Legislative Assembly) ఉద్యోగాల అంశం (Jobs Issue) మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఉద్యోగాల ప్రకటనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన గణాంకాలపై అనుమానాలు వ్యక్తమవుతూ ప్రతిపక్షం ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో మండలిలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మంత్రులకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ (Ramesh Yadav) గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఉద్యోగాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 5,72,280 ఉద్యోగాలు కల్పించామని మంత్రి ప్రకటించగా, అదే విషయంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారని గుర్తుచేశారు. ఈ రెండు ప్రకటనల మధ్య సుమారు 56 వేల ఉద్యోగాల వ్యత్యాసం కనిపిస్తోందని, ఈ లెక్కలు ఎలా వచ్చాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి పరస్పర విరుద్ధమైన గణాంకాలు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆధారాలు లేని వాటిగా కనిపిస్తున్నాయని విమర్శించారు. యువతకు ఉద్యోగాల కల్పనలో నిజమైన పురోగతి లేదని, తప్పుడు లెక్కలతో నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
అదేవిధంగా, గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి ప్రస్తుతం ఇచ్చింది కేవలం 15 వేల ఉద్యోగాలేనని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు సుమారు 5.2 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అది 8.2 శాతానికి చేరిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆరోపించారు.
లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, ఆ ఉద్యోగాలు ఎక్కడ, ఎలా ఇచ్చారో పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో యువతకు జాబ్ క్యాలెండర్ (Job Calendar), నిరుద్యోగ భృతి (Unemployment) వంటి హామీలు ఇచ్చినా, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడిచినా వాటిపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే పరంపర కొనసాగుతోందని పేర్కొంటూ, యువతకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం నిజమైన గణాంకాలను బయటపెట్టి ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన విధానం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.






