భగవద్గీత (Bhagavad Gita) అంశంపై నెలకొన్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. వైఎస్సార్సీపీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) బీఆర్ నాయుడు (BR Naidu) మరియు కిరణ్ రాయల్‌పై (Kiran Royal) తీవ్ర విమర్శలు చేశారు. భగవద్గీత గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆయన మండిపడ్డారు. అసభ్య వీడియోలు తీసే వారితో భగవద్గీతపై చర్చలు చేయించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా భగవద్గీత సారాన్ని సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించామని భూమన తెలిపారు. టీటీడీ మాన్యువల్ ప్రకారం విద్యార్థులకు (Students) భగవద్గీత పుస్తకాలు (Bhagavad Gita Books) పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. అయితే తాము టీటీడీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆ పుస్తకాలు ముద్రించబడ్డాయని ఆయన స్పష్టం చేశారు.
ఆ పుస్తకంలో తన పేరు, అప్పటి ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) ముందుమాట ఉండటంతో బీఆర్ నాయుడు అసహనం వ్యక్తం చేసి పుస్తకాన్ని విసిరేశారని భూమన ఆరోపించారు. భగవద్గీత సారాన్ని కేవలం 26 పేజీల పుస్తకంగా అందించామని ఆయన చెప్పారు. ఈ గ్రంథం గీతా భావాలకు విరుద్ధమని ఎవరైనా పండితులు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ విసిరారు.

అలాగే ఈ పుస్తకానికి రూ.50 కోట్లు ఖర్చయ్యాయన్న ఆరోపణలను భూమన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేసిన ఆరోపణలు అసత్యమని అన్నారు. అధికారిక పత్రాల ప్రకారం మొత్తం ప్రాజెక్టు ఆమోదిత వ్యయం సుమారు రూ.3.71 కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. రూ.50 కోట్లు ఖర్చయ్యాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా భూమన మరోసారి స్పష్టం చేశారు.
భగవద్గీత సారాన్ని ఐదు భాషల్లో ముద్రించి భక్తులకు పంపిణీ చేయడం చట్టబద్ధమైన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపై కూడా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు చేస్తున్న అన్యాయాలపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.






