ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా (Army Chief) కొనసాగుతున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) జూన్ 30న పదవీ విరమణ చేయనుండగా, ఆయన వారసుడిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను (Lieutenant General Dheeraj Seth) కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ‘వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్’(Vice Chief of the Army Staff)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ధీరజ్ సేథ్, భారత సైన్యంలో దాదాపు 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన సీనియర్ అధికారి.
ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (National Defence Academy – NDA) పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్, 1986 డిసెంబర్‌లో ఆర్మర్డ్ కార్ప్స్‌లో నియమితులయ్యారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో జూనియర్ కమాండ్ కోర్సులో ప్రథమ స్థానం సాధించి, ఉత్తమ ఆల్‌రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్ పతకాన్ని అందుకున్నారు. సైన్యంలో వ్యూహాత్మక ప్రణాళికలు, ఆధునీకరణ, యుద్ధ సామర్థ్యాల పెంపులో కీలక పాత్ర పోషించారు.
జమ్మూ కాశ్మీర్‌లో (Jammu & Kashmir) ఒక సాయుధ రెజిమెంట్‌తో పాటు సాయుధ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించిన ధీరజ్ సేథ్, తన సేవా కాలంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందిన తర్వాత సుదర్శన్ చక్ర కార్ప్స్ కమాండర్‌గా పనిచేశారు. అనంతరం ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా బాధ్యతలు చేపట్టి పలు జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను పర్యవేక్షించారు.
అదే విధంగా సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్‌లకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా సేవలందించి, రెండు కీలక ఆపరేషనల్ కమాండ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంగోలాలో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో సెక్రటరీగా కూడా సేవలందించారు.
ఇక సౌత్ వెస్ట్రన్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ ఆపరేషన్స్ (Brigadier General Staff Operations) బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్, సెరిమోనియల్ అండ్ వెల్ఫేర్ వంటి కీలక పదవుల్లో కూడా పనిచేశారు. సైనిక దళాల ఆధునీకరణ, యుద్ధ సన్నద్ధత పెంపు, వ్యూహాత్మక మార్పుల్లో ఆయన చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.








