ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మహిళలపై వేధింపుల అంశం సంచలనంగా మారింది. అధికార కూటమిలోని నాయకుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తాజాగా జనసేన పార్టీకి చెందిన మరో నేతపై తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన మత్స్యకార వికాస విభాగం అధ్యక్షుడు మల్లాడి రాజుపై ఈ ఆరోపణలు నమోదయ్యాయి. ఇప్పటికే ఆయనపై మొదటి భార్య ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయని స్థానికంగా చర్చ సాగుతోంది. భార్యను చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించాడని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. తల్లిని కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా అండగా ఉండాల్సిన మల్లాడి రాజు, వారిపైనే మానసిక ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. తల్లి నివసించిన ఇంటిని కూడా వారివద్ద నుంచి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని, పైగా పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని బాధితులైన ఆ ఇద్దరు కుమార్తెలు వీడియో విడుదల చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై స్పందించిన బాధితులు, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరుతున్నారు. పదవిని అడ్డం పెట్టుకుని సొంత కూతుళ్లనే వేధిస్తున్నారని ఆరోపిస్తూ మల్లాడి రాజుపై పార్టీ పరంగా మరియు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






