పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో చోటు చేసుకున్న ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు పాలనలో (Chandrababu Naidu Government) అభివృద్ధి శూన్యమంటూ అదే ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీకి (Jana Sena Party) చెందిన సర్పంచ్ (Sarpanch) గ్రామ సచివాలయానికి (Village Secretariat) తాళం వేసి నిరసన (Protest) చేపట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలో పసలదీవి సర్పంచ్ కొట్టు రామాంజనేయులు (Kottu Ram Anjaneyulu), పదిమంది వార్డుసభ్యులు, ఎంపీటీసీ సభ్యుడు అందరు జనసేన పార్టీకి చెందినవారే అయినప్పటికీ తమ గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) పంచాయతీరాజ్ శాఖ కేటాయించడంతో తమ గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని అప్పట్లో ఆశపడ్డామని ఆయన చెప్పారు. అయితే తమ పదవీకాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామానికి తగిన నిధులు రాకపోవడంతో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులను తానే స్వంత నిధులతో నిర్వహించానని సర్పంచ్ తెలిపారు. కానీ ఆ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో గ్రామ కార్యదర్శి తనకు, పంచాయతీ పాలకవర్గానికి కనీస ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగానే నిరసనగా సచివాలయానికి తాళం వేసినట్లు తెలిపారు. నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ (Bommidi Nayakar) కూడా జనసేన పార్టీకి చెందినవారే కావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.
ఇదిలా ఉండగా గతంలో పసలదీవి గ్రామ పంచాయితీలో జనసేన గెలిచిందని, అందుకే పంచాయితీకి నిధులు ఇవ్వడం మానేశారని ఆరోపిస్తూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి కూడా 20 నెలలుగా ఆ గ్రామానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ప్రభుత్వంలో భాగమైన పార్టీకి చెందిన సర్పంచ్‌కే నిధులు అందకపోవడం, అభివృద్ధి జరగకపోవడంతో నిరసనగా సచివాలయానికి తాళం వేయాల్సిన పరిస్థితి రావడం పరిపాలనపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఈ ఘటన ప్రభుత్వ పనితీరు, గ్రామీణాభివృద్ధి అంశాలపై మరింత రాజకీయ చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.






