దేశ అత్యున్నత న్యాయవ్యవస్థలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై అభిశంసన ప్రక్రియకు సిఫారసు జరిగిన నేపథ్యంలో, పార్లమెంటులో తీర్మానం రాకముందే రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం ఈ కేసుకు కేంద్రంగా మారింది. మంటలను ఆర్పే క్రమంలో ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు సమాచారం. లెక్కల్లో చూపని ఈ నగదు వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన అనంతరం ఆయన్ని ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, ప్రాథమిక ఆధారాలను పరిశీలించింది. అనంతరం ఆయనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని సిఫారసు చేసింది. న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియ చాలా అరుదుగా జరిగే విషయం కావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
అభిశంసన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజీనామా రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉంది. ఈ వ్యవహారం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.






