రాష్ట్రంలో ప్రేమోన్మాదుల హింస మళ్లీ భయానక స్థాయికి చేరుకుంది. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో విద్యార్థిని కీర్తనను పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో దారుణంగా హత్య చేసిన ఘటన సమాజాన్ని కుదిపేసింది. ఈ సంఘటనతో మరోసారి మహిళల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం అలసత్వం వల్ల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా, గతంలో మహిళల భద్రత కోసం ఉపయోగకరంగా నిలిచిన ‘దిశా’ వంటి యాప్ సేవలు నిలిచిపోవడం వల్ల మహిళలకు రక్షణ తగ్గిందని వారు అంటున్నారు. ఆ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందేది అని, ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగాయని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. విజయవాడ, అనకాపల్లి, విశాఖపట్నం, గుడివాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రేమ పేరుతో వేధింపులు, దాడులు, హత్యలు వరుసగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల యువతులు హత్యలకు గురవగా, మరికొన్నిచోట్ల ఆత్మహత్యలకు కూడా దారితీసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
బాధితుల వాదన ప్రకారం, చట్టాల అమలు లోపం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, రాజకీయ ప్రభావాలు వంటి అంశాలు ఈ ఘటనలకు కారణమవుతున్నాయి. ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ దాడులు కేవలం వ్యక్తిగత సమస్యలు కాకుండా, సామాజిక భద్రతకు పెద్ద సవాలుగా మారుతున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మహిళల భద్రతను పటిష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే, ఇలాంటి దారుణ ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రేమోన్మాదుల చేతిలో దాడులకు గురైన ఘటనలు ఇలా ఉన్నాయి:
2024 జూన్ 27: విజయవాడలో ప్రేమోన్మాది, టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ దర్శిని అనే యువతిని ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అడ్డుపడ్డ యువతి తండ్రిని హత్య చేశాడు.
2024 జూలై 6: అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి హత్య చేసిన ఉన్మాది.
2024 జూలై 17: విశాఖలో డిగ్రీ చదువుతున్న శ్యామల అనే యువతిపై ప్రేమోన్మాది సిద్ధు కత్తితో దాడి చేశాడు.
2024 జూలై 18: గుడివాడలో ఇంజినీరింగ్ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వేధించిన వేమూరి జాన్ హెన్రీ, ఏడాది క్రితం యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం మనసులో పెట్టుకుని, తొలిఏకాదశి పూజలో ఉన్న యువతి కుటుంబంపై దాడి చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లగా, స్టేషన్‌లోని సామాగ్రిపై కూడా దాడి చేశాడు. జాన్ స్థానిక తెలుగుదేశం నాయకురాలి కుమారుడు కావడం గమనార్హం.
2024 ఆగస్టు 4: గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్రాంతి అనే ప్రేమోన్మాది తన ప్రేమను నిరాకరించిందని, ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతిపై బ్లేడ్‌తో గొంతు కోసి హత్యాయత్నం చేశాడు.
2024 అక్టోబర్ 18: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియట్ విద్యార్థినిని, అదే గ్రామానికి చెందిన సన్నీ అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందని బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశాడు.
2024 అక్టోబర్ 18: బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్‌కు చెందిన దస్తగిరమ్మ అనే ఇంటర్మీడియట్ విద్యార్థినిపై, అదే ప్రాంతానికి చెందిన జక్కల విగేష్ ప్రేమించాలని వేధించాడు. ఆమె తిరస్కరించడంతో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
2024 అక్టోబర్ 19: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే మహిళను, కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత, రౌడీ షీటర్ నవీన్ ప్రేమిస్తున్నానని చెప్పి బలవంతంగా కారులో తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు.
2025 ఫిబ్రవరి 14: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది గణేష్. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడు గణేష్, కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
2025 ఏప్రిల్ 1: విశాఖపట్నం మధురవాడ, స్వయంకృషి నగర్ వద్ద ప్రేమ పేరుతో వేధిస్తున్న నవీన్, ప్రేమను నిరాకరించిందనే కారణంతో నక్కా దీపికపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పాటు, అడ్డువచ్చిన తల్లి లక్ష్మిపై దాడి చేసి హత్య చేశాడు.
2025 జూన్ 11: రాయచోటిలో ప్రేమోన్మాది అకృత్యాలు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తారకరత్న అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తూ, చెప్పితే తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది.
2025 సెప్టెంబర్ 13: నెల్లూరులో ప్రేమోన్మాది నిఖిల్, తనతో కలిసి బీఫార్మసీ చదివిన మైథిలి ప్రియను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె చెల్లెలు సాహితికి ఫోన్ చేసి “చంపేశాను” అని తెలిపాడు.
2025 అక్టోబర్ 1: కాకినాడ జిల్లాలో ప్రేమ పేరుతో మైనర్ యువతిని చంపిన అశోక్ అనే యువకుడు అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.
2025 డిసెంబర్ 10: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్‌లో ప్రేమించలేదన్న కోపంతో లహరి అనే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆమె అక్కడికక్కడే మరణించింది.
2026 ఏప్రిల్ 10: వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో ప్రేమోన్మాది ఆవుల వెంకటేష్, పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో విద్యార్థిని కీర్తనను గొంతుకోసి హత్య చేశాడు.






