ప్రముఖ మీడియా ఛానల్ అధిపతి రాధాకృష్ణ గారు వర్ధమాన రాజకీయాలపై తన శైలిలో ‘కొత్తపలుకు’ పేరుతో ప్రతి వారం సంపాదకీయం రాయడం పరిపాటి. రాధాకృష్ణ గారు చంద్రబాబు గారిని అత్యంత ఇష్టులుగా, జగన్ గారిని సైద్ధాంతిక శత్రువుగా చూస్తారు అనేది నిర్వివాద అంశం. ఆయన ‘కొత్తపలుకు’ సంపాదకీయాలు కూడా జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు గారికి అనుకూలంగా ఉంటాయనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తాజాగా రాసిన ‘కొత్తపలుకు’ సంపాదకీయం మాత్రం తీవ్రమైన విమర్శలకు దారితీసేలా ఉంది. తాజా సంపాదకీయంలో బీఆర్ నాయుడును వెనకేసుకు వచ్చే క్రమంలో ఆయన సామాజిక విలువలను సైతం వదిలేశారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
టీవీ5 చైర్మన్, టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు గారు ఒక మహిళతో ఉన్న ప్రైవేట్ వీడియో బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రాధాకృష్ణ గారి ‘కొత్తపలుకు’లో బీఆర్ నాయుడుకు, ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా అది వారి వ్యక్తిగత విషయం అని భావించాలన్నారు. అలాగే చలామణిలో ఉన్న వీడియోలు, ఇతర అంశాలు ఆయన టీటీడీ చైర్మన్‌గా నియమితులు కాకముందు జరిగినవని, అందువల్ల నాయుడు మహాపరాధం చేశారని చెప్పలేమని పేర్కొన్నారు. ఇంతకన్నా దుర్మార్గమైన సమర్థన మరొకటి ఉండదని హిందూ వాదుల నుండి వినిపిస్తున్న మాట. బీఆర్ నాయుడు వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించినా ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ ఆయన ప్రస్తుతం ఉన్నది పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో అన్న విషయం రాధాకృష్ణ గారికి అర్థం కాలేదా, లేక అర్థం చేసుకున్నా ఉద్దేశపూర్వకంగా ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమా అని హిందూ వాదులు మండిపడుతున్నారు. గతంలో టీటీడీలో ఉద్యోగం చేసే వ్యక్తి భార్య ఉండగానే మరో మహిళతో చనువుగా ఉన్నాడనే కారణంతో అతనిని ఉద్యోగం నుండి తొలగించిన విషయం రాధాకృష్ణ గారికి తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక తిరుమల లడ్డూ విషయంలో కూడా మరోసారి స్పందిస్తూ, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం సత్యమని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ తప్పుకు నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోవచ్చని అన్నారు. అయితే తన హయాంలో ఆ దేవదేవుడికి అపచారం జరిగినందుకు పశ్చాత్తాపం చెంది ‘సారీ’ చెప్పి ఉంటే వివాదం అంతటితో ముగిసేదని అభిప్రాయపడ్డారు. కానీ జగన్ అండ్ కో అలా చేయకుండా ఎదురుదాడికి దిగారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను కూడా వివాదంలోకి లాగారని రాధాకృష్ణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన సంస్థలలో ఒకటైన ఇందాపూర్ డెయిరీలో హెరిటేజ్ కూడా నెయ్యి ఉత్పత్తి చేసిందని ఆరోపించారని పేర్కొన్నారు.
నిజానికి తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడానికి సాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనే. ఆ నెయ్యి సాంపిల్స్ జగన్ పరిపాలనలో తీసినవి కావని స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ జగన్‌పై నిందలు మోపి రాజకీయ లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ లడ్డూ వివాదం చివరకు తమ సంస్థ హెరిటేజ్ దగ్గరికి చేరిన తరువాత ఇప్పుడు రాధాకృష్ణ తాము జగన్‌ను నిందించలేదని, ఆయన ‘సారీ’ చెబితే సరిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన పాలనలో జరగనిదానికి ఆయన నుండి క్షమాపణ కోరడం అనేది ఒక విచిత్రమైన ధోరణిగా, కూటమిని కాపాడుకోవాలనే తపనగా కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఆఖరికి చంద్రబాబుగారితో పరిచయం ఉందనే ఒకే కారణంతో అనైతిక లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్ వంటి వ్యక్తిని కూడా వెనకేసుకుని రావడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన పరంగా వరుస దెబ్బలు తగలడంతో రాధాకృష్ణ గారు ఆయనను కాపాడాలనే తొందరలో నైతికతను పూర్తిగా వదిలేశారనే మాట మీడియా వర్గాల్లో వినిపించడం గమనార్హం.






