ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి అనిత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కొత్త చర్చకు దారితీసింది. హోంమంత్రి అనిత ఉద్యోగ అవకాశాలపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయ కోణంలో స్పందించిన గుడివాడ అమర్నాథ్, అనంతరం వ్యక్తిగత స్థాయిలో జరిగిన మాటల యుద్ధంతో వివాదం మరింత ముదిరింది.
హోంమంత్రి అనిత తనపై పరుష పదజాలంతో వ్యాఖ్యానించారని ఆరోపించిన గుడివాడ అమర్నాథ్, ఆమె మేకప్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేక పార్టీగా చిత్రీకరించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే, ఈ వ్యూహం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనిత చేసిన వ్యాఖ్యలను, అలాగే టీడీపీ నాయకులు చింతమనేని ప్రభాకర్, అయ్యన్నపాత్రుడు తదితరులు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు విడుదల రజనీ, రోజాపై చేసిన మేకప్ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో తిరిగి ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగింది. దీంతో టీడీపీనే రక్షణాత్మక స్థితిలోకి వెళ్లిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, గుడివాడ అమర్నాథ్ తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడలేదని, తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తికే ప్రతిస్పందించానని వివరణ ఇవ్వడం కూడా ఈ వివాదంలో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.
ఇప్పటివరకు ప్రత్యర్థుల వ్యాఖ్యలను మహిళల అవమానంగా చూపిస్తూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన టీడీపీ, అదే వ్యూహాన్ని ఈసారి అనుసరించినప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగడంతో రాజకీయంగా ఫలితం దక్కనట్లు కనిపిస్తున్నాయి. డిఫెన్స్‌లోకి వెళ్లకుండా ఆఫెన్సివ్ రాజకీయాలు చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో టీడీపీ అనుకోని పరిస్థితిని ఎదుర్కొంటోందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది.






