మహిళల గౌరవం, మానవ హక్కులను తీవ్రంగా దెబ్బతీసే విధంగా చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” కార్యక్రమంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏప్రిల్ 4, 2026న ప్రసారమైన ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దూషణాత్మక, అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ విమర్శల పరిమితులను దాటి వ్యక్తుల గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని గురుమూర్తి స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా, వైఎస్సార్సీపీ మద్దతుదారులను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలు సమాజంలో మహిళల పట్ల అసభ్య దృక్పథాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వివాహ సంబంధాలను తక్కువ చేసి చూపడమే కాకుండా, మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇది మహిళల గౌరవం, సమానత్వాన్ని కాపాడే రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకమని తెలిపారు.
అలాగే, సరైన ఆధారాలు లేకుండా, ప్రత్యుత్తరం చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఈ ప్రసారం చేయడం మీడియా నైతిక ప్రమాణాలను ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు. టెలివిజన్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో విస్తృతంగా ప్రచారం కావడం వల్ల ఈ వ్యాఖ్యల ప్రభావం మరింత పెరిగిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు ఆధారంగా కీలక కేసులను ప్రస్తావిస్తూ, మహిళల గౌరవం, వ్యక్తిగత ప్రతిష్ఠ, బాధ్యతాయుత మీడియా వ్యవహారంపై ఉన్న న్యాయ సూత్రాలు ఉల్లంఘించబడ్డాయని ఫిర్యాదులో వివరించారు.
ఈ అంశంపై వెంటనే స్పందించి, సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను గురుమూర్తి కోరారు. మహిళల గౌరవం, మానవ హక్కులను రక్షించడానికి కఠినమైన మీడియా నైతిక ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పెర్కొన్నారు.





