బ్రెజిల్‌లోని (Brazil) రియో డి జనీరో (Rio de Janeiro) నగరంలో ఘోర విమాన ప్రమాదం (Helicopter Crash) సంచలనం సృష్టించింది. నగర పశ్చిమ ప్రాంతంలో గాల్లో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్న మొత్తం 6 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
మిలిటరీ ఫైర్ డిపార్ట్‌మెంట్ (Military Fire Department) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన ఒక హెలికాప్టర్ సమీపంలోని కార్ల డీలర్‌షిప్ పార్కింగ్ ప్రాంతంలో కుప్పకూలింది. దీంతో అక్కడ పార్క్ చేసి ఉన్న పలు ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాల్లోనే రెండు హెలికాప్టర్లు ఎలా ఢీకొన్నాయన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. అయితే ప్రయాణికుల జాబితాలో ప్రముఖ అమెరికన్ సింగర్, కమెడియన్ ఆలివర్ ట్రీ (Oliver Tree) పేరు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 4న అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరిస్‌లో సంగీత ప్రదర్శన ఇచ్చిన ఆలివర్.. శనివారం బ్రెజిల్ వీధుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం గమనార్హం.
ఇక అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ గాస్పర్ ప్రిమ్ డియాజ్(Gaspar Prim Diaz) అలియాస్ గాస్పి(Gaspi) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. కేవలం 23 ఏళ్ల వయసున్న గాస్పికి యూట్యూబ్‌లో 28 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ ఛానెల్ బ్లెండర్ తమ సోషల్ మీడియా ఖాతాలో “నీ కళ, నీ మ్యాజిక్‌ను ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ భావోద్వేగ నివాళి అర్పించింది. ఈ ఘటనతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.








