ఖమ్మం జిల్లా వెంకటగిరిలో బుధవారం నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు (Welfare Schemes), అభివృద్ధి కార్యక్రమాలు (Development Programmes) పూర్తిగా ఆగిపోయాయని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
వెలుగుమట్లలో అర్ధరాత్రి సమయంలో 1,000 ఇళ్లను కూల్చివేసి పేదలను రోడ్డున పడేశారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందం కలుగుతోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని (Khammam District) 3 మంది మంత్రులు ప్రజాప్రతినిధులుగా కాకుండా దండుపాళ్యం నాయకుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఖమ్మంలో ఉన్నది 3 మంది మొనగాళ్లు కాదని, 3 మంది మోసగాళ్లని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖలో అవినీతి (Corruption) సామ్రాజ్యం విస్తరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదనే భావనతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని విమర్శించారు. పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని, 22ఏ కింద కోట్ల ఎకరాల భూములను చేర్చారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (Revanth Reddy) ఘరానా దొంగగా అభివర్ణించిన కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Ponguleti Srinivasa Reddy) గజదొంగగా విమర్శించారు. రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలతో అహంకారంగా వ్యవహరిస్తున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వట్టినాగులపల్లిలో రైతులపై దాడులు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటినా ప్రజలు ఇప్పటికీ కేసీఆర్(KCR) తిరిగి రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతుబంధు అందడం లేదని, దేవుడి మీద ఒట్టు వేసి రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. యూరియా(Urea) కోసం రైతులు(Farmers) దుకాణాల ముందు క్యూల్లో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ రద్దు చేసిన భూమి శిస్తును మళ్లీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను (Bhatti Vikramarka) కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఆయన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సుమారు రూ.1 లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించారని, సీతారామ ప్రాజెక్టును 80 శాతం వరకు పూర్తి చేశారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో 2 నర్సింగ్ కళాశాలలు, 2 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఓటరు జాబితా వడపోత కార్యక్రమం జరుగుతోందని, ఎస్ఐఆర్ను(SIR) నిర్లక్ష్యం చేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో 3.39 కోట్ల మంది ఓటర్లు, 35,985 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌కు బీఆర్ఎస్ తరఫున ఒక బీఎల్ఏను (BLA) నియమించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కు దక్కేలా బీఎల్ఏలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
పాలేరు నియోజకవర్గంలో సుమారు 10,000 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని పేర్కొన్న కేటీఆర్, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఓటు కీలకమని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.






