ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలంగాణ (Telangana రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీపై (Congress Party) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ (TPCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పదేపదే తెలంగాణను అవమానించేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
రాజకీయాలు సినిమా డైలాగులు (Cinema Dialogues) కావని, బాధ్యతతో మాట్లాడాలని మహేశ్ గౌడ్ హితవు పలికారు. పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా మాట్లాడటం లేదని, కేంద్రంలోని బీజేపీ(BJP) పెద్దలు స్క్రిప్ట్ (Script) ఇస్తే దాని ప్రకారమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. “పవన్ పూర్తిగా బీజేపీ చేతిలో తోలుబొమ్మగా మారిపోయారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావాన్ని వ్యతిరేకించే ధోరణి బీజేపీ నేతల్లో ముందునుంచే ఉందని, ఇప్పుడు పవన్ కూడా అదే మార్గంలో నడుస్తున్నారని అన్నారు.
“తెలంగాణ ఉద్యమ (Telangana Movement) సమయంలో పవన్ ఎక్కడున్నారు..? ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు?” అంటూ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. వేలాది మంది యువకుల త్యాగాలతో తెలంగాణ సాధ్యమైందని, సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులువు కాదని, నెహ్రూ-గాంధీ కుటుంబాల (Nehru-Gandhi Family) త్యాగాల చరిత్రను పవన్ ముందుగా తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ (Narendra Modi) అంతరిక్ష రంగ విజయాల ముందు నిలబడి ఫోటోలు దిగుతున్నా, ఆ రంగానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఈరోజు పెద్ద హీరోగా ఎదగడంలో తెలంగాణ ప్రజల పాత్ర కూడా ఉందని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రేక్షకులు ఆదరించకపోతే ఆయన సినిమాలు ఈ స్థాయికి వచ్చేవి కావని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, తెలంగాణపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. “పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి. కాంగ్రెస్ గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదు” అంటూ ఘాటుగా స్పందించారు.
తెలంగాణ గురించి అధికార అహంకారంతో మాట్లాడితే సహించబోమని మహేశ్ గౌడ్ హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు వెళ్లాలని తాము కోరుకుంటున్నామని, కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పాలన (Welfare Governance) కొనసాగుతోందని, ఏపీ ప్రజలు కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా బీఆర్ఎస్(BRS) నేతలు ఎందుకు స్పందించడం లేదని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ఈ మౌనం వెనుక బీజేపీ, బీఆర్ఎస్, పవన్ కళ్యాణ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో లబ్ధి కోసం కొన్ని శక్తులు కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.






