తమ కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి ప్రవేశించబోవడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి స్పష్టంచేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మిథున్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. ఇదే సమయంలో కొత్తగా ఏర్పడిన టీవీకే కూటమి ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇటీవల కొన్ని టెలివిజన్ ఛానళ్లలో మిథున్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న చర్చలు పూర్తిగా అవాస్తవమని పళనిస్వామి తెలిపారు. ప్రస్తుతం ఆయన అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యుడిగా మాత్రమే ఉన్నారని, పార్టీలో ఎలాంటి బాధ్యతలు నిర్వహించడం లేదని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా తన కుమారుడు రాజకీయాల్లోకి రారని తాను స్పష్టంగా చెబుతున్నానన్నారు. ఆధారాలు లేని కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అన్నాడీఎంకేను ఎవరూ బలహీనపరచలేరని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని పేర్కొంటూ, పార్టీ బలంగా ముందుకు సాగుతుందని అన్నారు. గవర్నర్ ప్రసంగం వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని, అది కలలో కట్టిన కోటల మాదిరిగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
ఇక మరోవైపు అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అసంతృప్త ఎమ్మెల్యేలు సీనియర్ నేత సి.వి. షణ్ముగం నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి.
వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో 4 మంది తమ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం జరిగిన రాజీ చర్చలతో వేలుమణితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు తిరిగి పళనిస్వామి వర్గంలో చేరారు.
అయితే సి.వి. షణ్ముగం, సి. విజయ భాస్కర్ మాత్రం ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. వీరిలో సి. విజయ భాస్కర్ ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, సి.వి. షణ్ముగం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చెన్నైలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశానికి వేలుమణి, నత్తం విశ్వనాథన్, కె.పి. అన్బళగన్ హాజరుకావడం అన్నాడీఎంకేలో మళ్లీ రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలకు దారితీసింది.







