దేశవ్యాప్తంగా వైద్య విద్య కలలు కనే విద్యార్థులకు నీట్ పరీక్ష భారీ సవాల్‌గా మారుతోంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఒత్తిడి, ఆందోళన కారణంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకోగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల విద్యార్థిని అవంతిక భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
అవంతిక వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్షకు సిద్ధమవుతోంది. గురువారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో 4 అంతస్తుల భవనం పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మహారాజా యశ్వంతరావు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం ఘటన జరిగిన సమయంలో అవంతిక మొదట ఇంటి బాల్కనీలో నిలబడి మొబైల్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అనంతరం భవనం పై అంతస్తుకు వెళ్లిన ఆమె కొద్ది సేపటికే కిందపడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. పెద్ద శబ్దం వినిపించడంతో బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను రక్తపు మడుగులో పడి ఉండగా ఆసుపత్రికి తరలించారు.
అవంతిక స్వస్థలం ధార్ జిల్లా కాగా, నీట్ పరీక్ష కోసం తన అక్కతో కలిసి ఇందోర్‌లో నివాసం ఉంటోంది. ఆమె అక్క వైద్యురాలిగా పనిచేస్తుండగా, తండ్రి కూడా వైద్య రంగానికి సంబంధించిన శిక్షణ కోసం అదే నగరంలో ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో తండ్రి కూడా అదే ఫ్లాట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా అవంతిక సోదరుడు కొన్ని కీలక విషయాలను పోలీసులకు తెలిపాడు. గతంలో కూడా ఆమె విషపదార్థం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించాడు. ఇటీవల ఇందోర్ సమీపంలోని టించా జలపాతాన్ని సందర్శించాలని కోరినా కుటుంబ సభ్యులు అనుమతించలేదని చెప్పాడు. అలాగే మరణానికి ముందు అవంతిక తన అక్కతో వీడియో కాల్‌లో మాట్లాడినట్లు కూడా విచారణలో వెల్లడైంది.
ఘటనాస్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. దీంతో పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ రికార్డులు, కాల్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవంతిక మృతికి గల అసలు కారణాలను గుర్తించేందుకు విచారణ వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.







