భారత టెలికాం, డిజిటల్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా మార్కెట్‌లో వినిపిస్తున్న జియో ఐపీఓ ఊహాగానాలకు తెరదించుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ అధికారిక ప్రకటన చేశారు. దీంతో భారత పెట్టుబడి మార్కెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ముకేశ్ అంబానీ, జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను ఆమోదించిందని తెలిపారు. త్వరలోనే ఆ పత్రాలను సెబీకి సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో జియో స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టే ప్రక్రియ వేగం పుంజుకోనుంది.
జియో ఐపీఓ కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదని, ఇది రిలయన్స్ కుటుంబానికి, సంస్థకు, లక్షలాది వాటాదారులకు ఎంతో భావోద్వేగమైన మైలురాయిగా నిలుస్తుందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత భారీ పబ్లిక్ ఇష్యూగా ఈ ఐపీఓ నిలిచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సందర్భంగా తన తండ్రి ధీరూబాయ్ అంబానీ వారసత్వాన్ని గుర్తు చేసుకున్న ముకేశ్ అంబానీ, అందరి అభివృద్ధి అనే లక్ష్యంతోనే రిలయన్స్ ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను తదుపరి తరం స్వీకరిస్తోందని వెల్లడించారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలు జియో ఐపీఓ ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని, భవిష్యత్తులో కొత్త అవకాశాలను సృష్టించే బాధ్యతను కూడా వారే ముందుండి నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
దాదాపు 10 సంవత్సరాల క్రితం జియోను ప్రారంభించినప్పుడు భారతదేశంలో డిజిటల్ అసమానతలను తొలగించడమే ప్రధాన లక్ష్యమని ముకేశ్ అంబానీ గుర్తు చేశారు. అప్పట్లో కాల్ ఛార్జీలు అధికంగా ఉండేవని, డేటా సేవలు ఖరీదైనవని, ఇంటర్నెట్ వేగం కూడా చాలా తక్కువగా ఉండేదని చెప్పారు. జియో ప్రవేశంతో ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ ధరల్లో అధిక వేగం కలిగిన డేటా అందుబాటులోకి రావడంతో కోట్లాది మంది భారతీయుల డిజిటల్ జీవనశైలిలో విప్లవాత్మక మార్పు వచ్చిందని వివరించారు.
ప్రస్తుతం జియో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోంది. సంస్థకు 52.4 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. టెలికాం రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జియో 5జీ సేవలను ఇప్పటికే 26.8 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అలాగే జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్ల ఇళ్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుతోంది. ఈ గణాంకాలు జియో విస్తరణ ఎంత వేగంగా సాగిందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
జియో లిస్టింగ్ అనేది కేవలం స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించడం మాత్రమే కాదని, ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థలను నిర్మించే సామర్థ్యం భారతదేశానికి ఉందని ప్రపంచానికి నిరూపించే అవకాశమని ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆవిష్కరణ, విలువ సృష్టిలో భారత్ ప్రపంచానికి పోటీ ఇవ్వగలదని జియో మరోసారి చాటిచెబుతుందని అన్నారు.
మార్కెట్ అంచనాల ప్రకారం జియో ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫరీస్ గతంలో జియో విలువను సుమారు 180 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ఈ అంచనాలు నిజమైతే భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా జియో కొత్త రికార్డు సృష్టించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఐపీఓ రికార్డు హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరిట ఉంది. 2024 అక్టోబర్‌లో ఆ సంస్థ సుమారు రూ.27,870 కోట్లను సమీకరించింది. అయితే జియో ఐపీఓ ఆ రికార్డును అధిగమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత పెట్టుబడి మార్కెట్ చరిత్రలో జియో ఐపీఓ ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.








