నీట్ పరీక్షా (NEET Examination) పేపర్ లీక్ (Paper Leak) వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Deepke) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) బహిరంగ లేఖ రాశారు. నీట్ అవకతవకల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి (₹1 Crore) చొప్పున పరిహారం (Compensation) ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే రాజీనామా (Resignation) చేయాలని మరోసారి కోరారు. ఈ డిమాండ్లతో గత కొంతకాలంగా శాంతియుత ఉద్యమం కొనసాగిస్తున్న అభిజీత్, తన తాజా లేఖను ఎక్స్ వేదికగా ప్రజలకు వెల్లడించారు.
లేఖలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, నీట్ 2026 పరీక్షా పేపర్ లీక్, పరీక్ష రద్దు, అనంతరం రీ-టెస్ట్ నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు(Students) తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ఈ పరిణామాల కారణంగా గత కొన్ని వారాల్లో 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 5 మరణాలు గత 48 గంటల్లోనే చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీక్ ఘటనలు, రీ-టెస్ట్ (Re-Test) భయం, భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
యువత మానసిక ఆరోగ్యంపై ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అభిజీత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషాదకర ధోరణి తగ్గే సూచనలు కనిపించకపోగా మరింత తీవ్రమవుతోందని అన్నారు. గత 2 నెలల్లో ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల కుటుంబాలను తాను స్వయంగా కలిసి వారి బాధను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Open Letter to PM:
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 19, 2026
We urge PM @narendramodi to provide ₹1 crore in compensation to the families of students who died by suicide due to the paper leak crisis. pic.twitter.com/p6gOuNRvsT
విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలను సరిదిద్దేందుకు సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కూడా లేఖలో సూచించారు. విద్యాపరమైన నిరాశ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, అనిశ్చితి కారణంగా ఇకపై ఒక్క విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పిల్లలను కోల్పోయిన కుటుంబాలు భరించలేని మానసిక వేదనతో పాటు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నాయని అభిజీత్ పేర్కొన్నారు. తమ పిల్లల ఉన్నత విద్య కోసం అనేక కుటుంబాలు భారీ మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, అయితే విద్యా వ్యవస్థలోని వైఫల్యాల కారణంగా వారి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయని అన్నారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించడం తన నైతిక బాధ్యతగా భావించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.








