విజయవాడ (Vijayawada) కృష్ణలంకకు (Krishnalanka) చెందిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కేసులో ఎట్టకేలకు ప్రభుత్వం కదిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి వాదనలు విన్న తర్వాతే ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి (Vijayalakshmi) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu) సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పి, ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
అయితే ఈ పరిణామాల మధ్య ప్రతిపక్షాలు మరోసారి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గాదె సాయికృష్ణ(Gade Sai Krishna), క్రాంతికుమార్ (Kranti Kumar) మరణాలపై సీబీఐతో(CBI) విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలీసుల దుర్వినియోగాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాయి. జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే వరకు ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నాయి.
గత నెల 28వ తేదీన సాయికృష్ణ పిన్ని, న్యాయవాది కనకదుర్గ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. జగన్ జోక్యం చేసుకున్న తర్వాతే సీఐపై చర్యలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో లాకప్ డెత్ (Lockup Death) జరిగినట్లు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లేనని, మొదట జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు బాధితులకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం కొత్త స్వరం వినిపిస్తోందని విమర్శిస్తున్నాయి.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు (CBI Investigation) ఆదేశించి తమ నిబద్ధతను నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటివరకు హోంమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం, లేదా కేసుపై బహిరంగ సమీక్ష నిర్వహించకపోవడం కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నాయి.
మరోవైపు, గాదె సాయికృష్ణను అత్యంత ప్రమాదకర నేరస్తుడిగా, అనేక కేసులు ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం అధికార పార్టీ అనుబంధ సోషల్ మీడియా వేదికల్లో జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక స్పందన రావడంతోనే ఇప్పుడు ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని కలవాలని నిర్ణయించుకున్నారని, ఇది అధికార పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పలువురు రాజకీయ విశ్లేషకులు మరియు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.







