ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి (Coalition Government) ప్రజలు స్పష్టమైన ప్రజా మద్దతుతో అధికార బాధ్యతలు అప్పగించినప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. రైతులు(Farmers), యువత(Youth), ఉద్యోగులు(Employees), కార్మికులు(Workers) సహా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తమ సమస్యలను వినిపించుకునేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) వద్దకు బాధితులు వరుసగా వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీ(DSC) అభ్యర్థులు, ఆక్వా రైతులు, అమరావతి రైతులు, కరేడు రైతులు, మామిళ్లపల్లి రైతులు, ఆరోగ్యశ్రీ వైద్యులు, సుగాలి ప్రీతి తల్లి పార్వతి, రాజమహేంద్రవరం కల్తీ పాల బాధితులు తదితర వర్గాలకు చెందిన వారు జగన్ను కలిసి తమ సమస్యలను వివరించడం గమనార్హంగా మారింది.
అంతేకాకుండా, ఒక సమస్యపై జగన్ స్పందించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాతే అధికార యంత్రాంగంలో కదలిక కనిపిస్తోందనే వాదన కూడా ప్రజల్లో వినిపిస్తోంది. గుంటూరు మిర్చి రైతుల సమస్యలు, పోదిలి పొగాకు రైతుల ఇబ్బందులు, చిత్తూరు మామిడి రైతుల కష్టాలు, ఏఎఫ్యూ విద్యార్థుల అంశం, రైతుల యూరియా సమస్యలు, ఆక్వా రైతుల డిమాండ్లు వంటి అనేక అంశాల్లో జగన్ జోక్యం చేసుకున్న తర్వాతే ప్రభుత్వం స్పందించిందని వైఎస్సార్సీపీ(YSRCP) వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల విజయవాడలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణల వ్యవహారంలో కూడా జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రభుత్వం చర్యలకు దిగిందనే వాదన ప్రతిపక్ష శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటిని ఉదాహరణలుగా చూపిస్తూ, ప్రభుత్వం స్వయంగా స్పందించకపోయినా జగన్ అంశాన్ని ప్రస్తావించిన తర్వాతే చర్యలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, కూటమి ప్రభుత్వ పనితీరును, వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు పెరుగుతున్నాయనే విషయాన్ని విస్మరించలేమని చెబుతున్నారు.







