భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ (Gaganyaan) మిషన్‌లో ఇస్రో (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. గగన్‌యాన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రధాన పారాచూట్ (Main Parachute) వ్యవస్థను విజయవంతంగా పరీక్షించి మరో మైలురాయిని చేరుకుంది. ఈ సక్సెస్‌తో మిషన్ భద్రతపై మరింత నమ్మకం పెరిగింది.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ (Sheopur) ప్రాంతంలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADRDE) డ్రాప్ జోన్లో భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-76 (IL-76) విమానం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఎయిర్‌డ్రాప్ (Air Drop) పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డమ్మీ పేలోడ్‌ను ప్రధాన పారాచూట్ సురక్షితంగా మందగింపజేసి విజయవంతంగా నేలపైకి దించింది.
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ (Crew Module) సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కావడానికి మొత్తం 10 పారాచూట్ల వ్యవస్థ పనిచేస్తుంది. ఇందులో ప్రధాన పారాచూట్ అత్యంత కీలకమైన భాగంగా ఉండటంతో ఈ పరీక్ష విజయవంతం కావడం మిషన్‌కు భారీ ఊరటనిచ్చింది.
ఈ విజయంతో గగన్‌యాన్ తొలి మానవరహిత జీ-1 (G1) మిషన్‌కు అవసరమైన పారాచూట్ వ్యవస్థ పనితీరు, విశ్వసనీయత మరింత బలపడిందని ఇస్రో వెల్లడించింది. భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర దిశగా ఇది మరో కీలక అడుగుగా అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








