---Advertisement---

“అన్యాయం జరుగుతోంది.. ప్లేయర్లను సమానంగా చూడటం లేదు”… అశ్విన్ కీలక వ్యాఖ్యలు

July 9, 2026

Summarize with AI

---Advertisement---

టీమిండియాలో (Team India) ప్లేయర్స్‌ను (Players) తరచూ మార్చే విధానంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ (Sanju Samson) విషయంలో అన్యాయం జరిగిందని, జట్టులో ప్రతి ఆటగాడిని ఒకే ప్రమాణాలతో చూడటం లేదని మండిపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, కొద్ది నెలల క్రితమే టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్‌ను కేవలం కొన్ని మ్యాచ్‌ల ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని ప్రశ్నించాడు.

ప్రముఖ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో (Vimal Kumar) తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, ఇంగ్లాండ్‌తో (England వరుసగా 2 మ్యాచ్‌లు ఓడిన తర్వాత ఇప్పుడు తదుపరి బలయ్యే ఆటగాడు ఎవరో చెప్పాలంటూ సెలెక్టర్లను నిలదీశాడు. ఐర్లాండ్ పర్యటనలో 2 పరాజయాల తర్వాత ఫామ్ కోల్పోయాడనే కారణంతో సంజూను తప్పించారని, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా 2 ఓటములు వచ్చిన నేపథ్యంలో మరో ఆటగాడిపై వేటు మొదలవుతుందా అని ప్రశ్నించాడు.

ఆటగాళ్లలో అభద్రతా భావం పెరగడం భారత క్రికెట్‌కు చాలా ప్రమాదకరమని అశ్విన్ హెచ్చరించాడు. జట్టులో స్థానం కోల్పోతామనే భయం మొదలైతే ఆటగాళ్లు దేశం కోసం కాకుండా తమ స్థానాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఆడే పరిస్థితి వస్తుందని తెలిపాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అలాంటి పరిస్థితి జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్‌ను (Suryakumar Yadav) జట్టు నుంచి తప్పించిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని తాను ప్రస్తావించినట్లు గుర్తు చేశాడు.

సంజూ శాంసన్‌కు మళ్లీ అవకాశం వచ్చినా, అతడు జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్కోరు గురించే ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితి వస్తే అతడిని తప్పుబట్టలేమని చెప్పాడు. ఆటగాళ్లలో భద్రతా భావాన్ని కల్పించడం జట్టు యాజమాన్యం బాధ్యత అని పేర్కొన్నాడు.

టెస్టు జట్టులో సాయి సుదర్శన్‌కు (Sai Sudharsan) ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ ప్రకటించిన విషయాన్ని కూడా అశ్విన్ గుర్తు చేశాడు. కేవలం 4 మ్యాచ్‌లతో ఒక ఆటగాడిని అంచనా వేయలేమని చెప్పిన అదే యాజమాన్యం, సంజూ శాంసన్‌ను మాత్రం 3 లేదా 4 మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదనే కారణంతో ఎలా పక్కన పెడుతుందని ప్రశ్నించాడు. అందరికీ ఒకే ప్రమాణాలు లేకపోయినా, కనీసం మరో 2 అవకాశాలు అయినా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

సంజూ శాంసన్‌కు విశ్రాంతి ఇచ్చిన నిర్ణయంపైనా అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంజూ కేవలం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడని, టెస్టులు లేదా వన్డేల్లో ఆడని ఆటగాడికి విశ్రాంతి అవసరం ఏమిటని ప్రశ్నించాడు. జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందని, అలాంటి ఆటగాడికి ప్రత్యేకంగా రెస్ట్ ఇవ్వడం పూర్తిగా అన్యాయమని అశ్విన్ స్పష్టం చేశాడు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment