---Advertisement---

UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్…సోమవారం 59వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరణ!

July 17, 2026

Summarize with AI

---Advertisement---

బ్రిటన్ (Britain) అధికార లేబర్ పార్టీకి (Labour Party) కొత్త నాయకుడిగా ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) ఎన్నికయ్యారు. దీంతో సోమవారం ఆయన అధికారికంగా యునైటెడ్ కింగ్‌డమ్ 59వ ప్రధానమంత్రిగా (Prime Minister) బాధ్యతలు స్వీకరించనున్నారు. లండన్‌లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్ షబానా మహ్మూద్ (Shabana Mahmood) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఎలాంటి పోటీ లేకుండానే ఆండీ బర్న్‌హామ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు.

సోమవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాజు చార్ల్స్-3ను ఆండీ బర్న్‌హామ్ కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజు అధికారికంగా ఆహ్వానం అందించనున్నారు. అంతకుముందు ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్‌మర్ తన రాజీనామాను రాజుకు సమర్పించనుండగా, అనంతరం ఆండీ బర్న్‌హామ్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దాదాపు 20 ఏళ్లపాటు లేబర్ పార్టీలో (Labour Party) కీలక రాజకీయ ప్రస్థానం కొనసాగించిన ఆండీ బర్న్‌హామ్.. దాదాపు 10 ఏళ్ల క్రితం లండన్ రాజకీయాలను వీడి గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన.. ఇప్పుడు అనూహ్యంగా దేశ అత్యున్నత పదవిని అధిరోహించబోతున్నారు.

కేవలం 2 ఏళ్ల పాలన తర్వాత కీర్ స్టార్‌మర్ పదవి వీడాల్సి రావడంతో 56 ఏళ్ల ఆండీ బర్న్‌హామ్‌కు (Andy Burnham) ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కింది. అయితే ప్రజలు నేరుగా ఎన్నుకోకుండానే ఈ పదవిని చేపట్టడం వల్ల ఆయన ముందున్న సవాళ్లు తక్కువ కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేబర్ పార్టీ కార్యకర్తలు, బ్రిటన్ ప్రజలు ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నారని, వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన భుజాలపై ఉందని అభిప్రాయపడుతున్నారు.

లివర్‌పూల్‌లో జన్మించిన ఆండీ బర్న్‌హామ్ (Andy Burnham) సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన నాయకుడు. ఆయన తండ్రి బ్రిటిష్ టెలికాం సంస్థలో ఇంజనీర్‌గా, తల్లి రిసెప్షనిస్ట్‌గా పనిచేశారు. క్యాథలిక్ కుటుంబంలో పెరిగిన ఆయన ప్రస్తుతం తాను పెద్దగా మతపరమైన వ్యక్తిని కాదని చెప్పుకున్నప్పటికీ.. సామాజిక న్యాయం, సమానత్వం వంటి విలువలను క్యాథలిక్ బోధనలు, లేబర్ పార్టీ సిద్ధాంతాల నుంచే నేర్చుకున్నానని గతంలో పేర్కొన్నారు.

బర్న్‌హామ్ కుటుంబంలో విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించిన తొలి తరం వ్యక్తుల్లో ఆయన ఒకరు. ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో (Cambridge University) ఉన్నత విద్య పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు లేబర్ పార్టీ నాయకుడిగా బ్రిటన్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సోమవారం నుంచి అధికారికంగా బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదిలా ఉంటే ఆండీ బర్న్‌హామ్‌కు భారత్‌తో(India) కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు భారత్‌ను సందర్శించిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో భారత్-బ్రిటన్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment