సౌదీ యువరాజు (Saudi Prince) అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ (Abdullah bin Fahad bin Abdullah bin Abdulaziz bin Jalawi Al Saud) (29) మృతి కేసులో యూకే కోర్టు కీలక విషయాలను వెల్లడించింది. లండన్‌లోని (London) హోటల్లో మద్యం, మాదకద్రవ్యాలు, ప్రిస్క్రిప్షన్ మందులను కలిసి తీసుకోవడం వల్లే యువరాజు ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు జరిగిన మరణమని అధికారికంగా తేల్చింది.
2025 నవంబర్ 25న లండన్‌లోని కెన్సింగ్టన్ మారియట్ హోటల్ (Kensington Marriott Hotel) గదిలో యువరాజు స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అత్యవసర వైద్య బృందం చికిత్స అందించినప్పటికీ అప్పటికే మరణించినట్లు నిర్ధారించింది. అనంతరం కేసు ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ కోర్టుకు (Inner West London Coroner Court) చేరింది.
టాక్సికాలజీ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. యువరాజు రక్తంలో 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఇంగ్లాండ్‌లో (England) అనుమతించే డ్రంక్ డ్రైవింగ్ పరిమితి కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే ప్రమాదకర స్థాయిలో GHB పార్టీ డ్రగ్, కేనబిస్, జానాక్స్ (Alprazolam)తో పాటు ఆందోళన నివారణ మందుల ఆనవాళ్లు కూడా లభించాయి. పోస్టుమార్టం నివేదికలో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏవీ లేవని వెల్లడైంది. మద్యం(Alcohol), డ్రగ్స్(Drugs), మందుల (Medicines) కలయికతో గుండెపోటు రావడం వల్లే మరణం సంభవించిందని వైద్య నిపుణులు కోర్టుకు వివరించారు.
విచారణలో సీసీటీవీ దృశ్యాలు కూడా కీలకంగా మారాయి. యువరాజు 2025 నవంబర్ 19న వారం రోజుల బస కోసం హోటల్లో చెక్-ఇన్ చేసినట్లు గుర్తించారు. మరణానికి ముందు రోజు రాత్రి సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లి కొద్దిసేపటికే ఒంటరిగా గదికి తిరిగి వచ్చినట్లు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత గదిలోకి మరెవరూ ప్రవేశించలేదని, మూడో వ్యక్తి ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.
విచారణలో యువరాజు గతంలో మద్యం అలవాటు, ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడే సమస్యతో చికిత్స పొందినట్లు వెల్లడైంది. 2025 ఆగస్టులో రోహాంప్టన్లోని ప్రైయరీ క్లినిక్‌లో డీటాక్స్ చికిత్స తీసుకున్న అనంతరం మెర్సీసైడ్‌లోని రైన్ఫోర్డ్ హాల్ క్లినిక్‌లో మరింత వైద్యం పొందాడు. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విక్టోరియా చమోరో తెలిపిన వివరాల ప్రకారం చికిత్సకు యువరాజు మంచి స్పందన చూపాడని, డిశ్చార్జ్ సమయంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కనిపించలేదని తెలిపారు. అయితే తర్వాత ఫాలోఅప్ అపాయింట్మెంట్లకు మాత్రం హాజరుకాలేదని వెల్లడించారు.
విచారణలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని, యువరాజు ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తం చేయలేదని అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్ వెల్లడించారు. హత్య లేదా ఇతరుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని స్పష్టం చేశారు. అనంతరం సౌదీ రాయల్ కోర్టు విదేశంలో యువరాజు మరణించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. తర్వాత రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించారు.








