తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. భూ కేటాయింపులు, టెసేరాక్ సంస్థ వ్యవహారం, ఓటర్ల జాబితా, వరుణ యాగం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) కుటుంబానికి భూ కేటాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణలో అంతకంటే ఎక్కువ స్థాయిలో భూ కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
టెసేరాక్ సంస్థకు అనుముల కొండల్‌రెడ్డి (Anumula Kondal Reddy) చైర్మన్‌గా ప్రకటించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి కూడా లేని, కేవలం రూ.1 లక్ష మూలధనం ఉన్న కంపెనీకి పఠాన్‌చెరులో వేల కోట్ల విలువైన భూమిని కేటాయించారని విమర్శించారు. గజానికి రూ.7,000 చొప్పున సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. టెసేరాక్‌కు సీఎం కుటుంబంతో సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) చెబుతున్న నేపథ్యంలో.. కొండల్‌రెడ్డి చైర్మన్‌గా ఎందుకు ప్రకటించుకున్నారని, ఆయన కుమారుడు సంస్థ తరఫున ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
కర్ణాటకలో భూ కేటాయింపులపై లోకాయుక్తను ఆశ్రయించిన తరహాలోనే తెలంగాణలోనూ ఈ అంశంపై పోరాడతామని కేటీఆర్ తెలిపారు. రూ.1 లక్ష మూలధనంతో కంపెనీ ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్ నేతలకు కూడా 5 ఎకరాల భూమి కేటాయిస్తారా అని ప్రశ్నించారు.
మరోవైపు 74 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉందన్న ప్రచారంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 17న ఓటర్ల జాబితా విడుదల కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లా కమిటీలతో సమావేశాలు నిర్వహించామని, అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశం నిర్వహించే అంశాన్ని కేసీఆర్‌తో(KCR) చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు.
వరుణ యాగంపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకే యాగాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో యాగం నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తూ.. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో వెంటనే పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడంపైనా కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు(BJP MP)ఉన్నా ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా తీసుకురాలేకపోయారని విమర్శించారు. ‘8 ప్లస్ 8 ఈక్వల్ టు జీరో’ అంటూ సెటైర్ వేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.







కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ మద్దతు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!