ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) డీఎస్సీ నియామకాల్లో (DSC Irregularities) అవకతవకలు, నిరుద్యోగ భృతి(Unemployment Allowance), ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలపై విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు (Student and Unemployed Associations) చేస్తున్న పోరాటానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ స్కాలర్ నేహా బోరాను (Neha Bora) ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
డీఎస్సీ బాధితులతో కలిసి నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ ఎంబేటి రామచంద్ర (MBETI Ramachandra) నేతృత్వంలోని బృందం నేహా బోరాను (Neha Bora) కలిసి రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. దాదాపు ఏడాది కాలంగా డీఎస్సీ నియామకాల్లో నష్టపోయిన అభ్యర్థులు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు సమగ్ర విచారణకు ఆదేశించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) అక్రమాలు, పేపర్ లీకేజీపై (Paper Leak) వస్తున్న ఆరోపణలు, మెరిట్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ తుది ఎంపిక జాబితాలో చోటు దక్కకపోవడం వంటి అంశాలను నేహా బోరా దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన అనుమానాలపై తక్షణమే సీబీఐ(CBI) విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలని నేహా బోరాను కోరారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం (Coalition Government) ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే వరకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రతినిధులు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు.
విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశాన్ని కూడా నేహా బోరా దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు రూ.9,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ కో-కన్వీనర్, కార్యదర్శితో పాటు డీఎస్సీ బాధితులు ఆది లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేహా బోరా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల సమస్యలపై అండగా నిలుస్తామని, వారి డిమాండ్లను జాతీయ స్థాయిలో లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల (Fee Reimbursement Dues) వరకు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “మీ పోరాటమే మా పోరాటం” అంటూ వారికి మద్దతు ప్రకటించారు.
విద్యార్థి సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో పాల్గొన్న నేహా బోరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అంశంపై(Andhra Pradesh DSC) గళం కలపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయి విద్యార్థి సంఘం మద్దతు లభిస్తే డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు మరింత విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే డీఎస్సీ నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాల పోరాటానికి నేహా బోరా మద్దతు ప్రకటించడం కూటమి ప్రభుత్వంపై మరింత రాజకీయ ఒత్తిడికి దారితీసే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.







