సుగాలి ప్రీతి కేసుకు (Sugali Preethi Case) తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి (Sugali Parvathi) చేపట్టిన కర్నూలు (Kurnool) నుంచి అమరావతి (Amaravati) వరకు వీల్‌చైర్ యాత్రను (Wheelchair Yatra) పోలీసులు అడ్డుకోవడం కర్నూలులో ఉద్రిక్తతకు దారితీసింది. యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ముందుగానే ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు అందించడంతో పాటు, యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమైన సమయంలోనూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పార్వతి బంధువులతో పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
తన కుమార్తెకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో సుగాలి పార్వతి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. కేసులో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వాలను (Governments) కోరుతూ వస్తున్నారు. తాజాగా తన గోడును ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్‌చైర్ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
అయితే శాంతిభద్రతల (Law and Order) సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత తనను యాత్రకు అడ్డుకోవడం ఇది రెండోసారి అని పార్వతి ఆరోపిస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) కలిసి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన సమయంలోనూ తనను పోలీసులు గృహనిర్బంధం చేశారని ఆమె పేర్కొన్నారు.
2017లో కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. తొమ్మిదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గతంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పార్వతి గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ తమ కుమార్తె కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు బాధితుల తరఫున పోరాడిన నాయకులు.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బాధితుల యాత్రలను ఎందుకు అడ్డుకుంటున్నారని స్థానికంగా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుగాలి ప్రీతి కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రభుత్వం తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు వైఎస్సార్‌సీపీ(YSRCP) వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తొమ్మిదేళ్లు పూర్తయినా న్యాయం కోసం తల్లి పోరాటం కొనసాగుతుండటంతో.. సుగాలి ప్రీతి కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







