విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) విషయంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న తాజా నిర్ణయం కొత్త చర్చకు దారితీసింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే అవకాశాలపై ఇప్పటికే ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో, ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం మూడు నెలల గడువు ఇచ్చి, నవంబర్ 17 నాటికి యూనిట్‌ను పూర్తిగా ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
2024 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1,500 మంది CISF సిబ్బంది భద్రతా విధులు నిర్వహించారు. అనంతరం దశలవారీగా వారి సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 350 మంది భద్రతా సిబ్బంది, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని కూడా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ(Union Home Ministry) ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నిర్ణయం నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు, భద్రతా ఏర్పాట్లు, అలాగే CISF స్థానంలో ప్రత్యామ్నాయ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రైవేటీకరణపై గతంలోనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో, CISF బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది.







