ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉత్తర భారత్‌లో రుతుపవనాలు మరింత చురుగ్గా మారడంతో ఢిల్లీతో పాటు నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వర్షాల ధాటికి ప్రధాన రహదారులు జలమయమై, జనజీవనం స్తంభించడంతో పాటు రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రతికూల వాతావరణం ప్రభావంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన 15 విమానాలను అధికారులు ఇతర ప్రాంతాలకు దారి మళ్లించారు. ఇందులో 12 విమానాలను జైపూర్‌కు, 2 విమానాలను ఛండీగఢ్‌కు, మరో విమానాన్ని లక్నోకు మళ్లించారు. విమాన రాకపోకల్లో సగటున 32 నిమిషాల ఆలస్యం చోటుచేసుకోగా, సుమారు 262 విమాన సర్వీసులపై వర్షాల ప్రభావం పడింది.
భారీ వర్షాలతో ఢిల్లీలోని పలు ప్రధాన రహదారులు నీట మునిగాయి. గుర్గావ్‌లోని సోహ్రా రోడ్ ఇస్లాంపూర్ ప్రాంతంలోని సర్వీస్ లేన్‌లో దాదాపు 2 అడుగుల మేర నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఢిల్లీలోని సంగమ్ విహార్, ఎంబీ రోడ్ ప్రాంతాల్లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటల తరబడి కదలకుండా నిలిచిపోయాయి. కార్యాలయాలు, విమానాశ్రయం, సాకేత్ కోర్టుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఘాజియాబాద్‌లోని ఎన్‌హెచ్-9 పారిశ్రామిక ప్రాంతం అండర్‌పాస్ కూడా నీటితో నిండిపోవడంతో వాహనదారులు తమ ప్రయాణాలను నిలిపివేసి రోడ్డు పక్కన వేచి ఉండాల్సి వచ్చింది.
అయితే, గత కొంతకాలంగా ఉక్కపోతతో సతమతమవుతున్న ఢిల్లీ ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. ఇండియా గేట్‌తో పాటు నోయిడాలో వర్షం కురిసిన దృశ్యాలు ఆహ్లాదకరంగా కనిపించాయి.
ఇదిలా ఉంటే, రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫరీదాబాద్, గుర్గావ్ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఉత్తరాఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.







