ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఉద్యోగుల సమస్యలు(Employees Issues), పెండింగ్ బకాయిలపై(Pending Dues) ఉద్యమం మరోసారి వేడెక్కుతోంది. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు, వేతన సవరణ(Pay Revision), డీఏలు(DA), పెన్షన్ (Pension) తదితర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravati) పిలుపునిచ్చింది.
విజయవాడలో(Vijayawada) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu), ఇతర నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. జూలై 22న మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలకు నెల రోజులు దాటినా ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన తక్షణం 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)(PRC) చైర్మన్ నియామకం, ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)(IR) ప్రకటించడం, పెండింగ్‌లో ఉన్న 4 డీఏల బకాయిల చెల్లింపు, డీఏ బిల్లుల (DA Bills) సమర్పణకు నిధి పోర్టల్‌లో వెంటనే మాడ్యూల్ అందుబాటులోకి తేవడం, పెన్షనర్లకు మిగిలిన గ్రాట్యుటీ, ఈఎల్ బకాయిల చెల్లింపు, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) (OPS) అమలు, మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్య పరిష్కారం, మోడల్ స్కూల్ సొసైటీని రద్దు చేసి విద్యాశాఖలో విలీనం, పెండింగ్‌లో ఉన్న తెలుగు, హిందీ పీజీటీ పోస్టులకు అనుమతి, గురుకుల సీఆర్‌ల రెన్యూవల్, కరోనా సమయంలో మరణించిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, అర్హత ఉన్న కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్, విభజన సమస్యల పరిష్కారం, అంతర్రాష్ట్ర బదిలీల వేగవంతం, భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా బదిలీ విధానంలో మార్పులు, ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపకల్పన, టెట్‌కు సంబంధించి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు లాంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని తప్పు పట్టారు.
ఉద్యోగులు ఇంతకాలం ప్రభుత్వంపై నమ్మకంతోనే ఓపిక పట్టారని, ఆ సహనాన్ని బలహీనతగా భావించవద్దని నాయకులు హెచ్చరించారు. ఉద్యమం కేవలం బకాయిల కోసం మాత్రమే కాదని, ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం జరిగే పోరాటమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 28న విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో (Makineni Basava Punnaiah Auditorium) ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో తదుపరి ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి గతంలో మాదిరిగా ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని జేఏసీ నాయకత్వం పిలుపునిచ్చింది.






