---Advertisement---

అర్హత లేని వ్యక్తికి స్విమ్స్ పగ్గాలా? టీటీడీ నిర్ణయంపై తీవ్ర వివాదం!

August 26, 2026

Summarize with AI

---Advertisement---

టీటీడీ(TTD) ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)(SVIMS) డైరెక్టర్ కమ్ వైస్‌ ఛాన్సలర్ అదనపు బాధ్యతల నియామకం తీవ్ర వివాదానికి దారితీసింది. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్న డాక్టర్ ఆర్వీ కుమార్ (Dr. R.V. Kumar) పదవీకాలం ముగియడంతో, టీటీడీ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్‌కు (Dr. Guduru Jagadish) స్విమ్స్ (SVIMS) అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈవో రవిచంద్ర (EO Ravichandra) ఆదేశాలు జారీ చేశారు.

అయితే, ఈ నియామకం జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ), స్విమ్స్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైస్‌ ఛాన్సలర్ స్థాయి పదవికి నియమితులయ్యే వ్యక్తికి ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీ(HOD), డీన్ (Dean) లేదా రిజిస్ట్రార్ (Registrar) వంటి కీలక హోదాల్లో నిర్దిష్ట అనుభవం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పని చేయని వ్యక్తికి స్విమ్స్ వంటి అత్యంత కీలకమైన సంస్థ బాధ్యతలు ఎలా అప్పగిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంతేకాకుండా, ఎన్‌ఎంసీ (NMC) నిబంధనల ప్రకారం 70 ఏళ్లు దాటిన వ్యక్తిని ఇలాంటి కీలక వైస్‌ ఛాన్సలర్ పదవికి నియమించడంపై పరిమితులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. 72 ఏళ్ల డాక్టర్ గుడారు జగదీష్‌కు (Dr. Guduru Jagadish) అదనపు బాధ్యతలు అప్పగించడం నిబంధనల ఉల్లంఘన కాదా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

డాక్టర్ గుడారు జగదీష్‌పై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు విమర్శకులు గుర్తుచేస్తున్నారు. గత డిసెంబర్‌లో బర్డ్ ఆసుపత్రి నిర్వహణ, వైద్య ఇంప్లాంట్ల కొనుగోళ్లు, మందులు మరియు సర్జికల్ ఇంప్లాంట్ల కొరత, ఓపీడీ సేవల నిర్వహణ తదితర అంశాలపై ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఆ ఫిర్యాదులో మెడికల్ ఇంప్లాంట్ల కొనుగోళ్లలో కొందరు టెండర్ దారులకు అనుకూలంగా మార్పులు చేశారనే ఆరోపణలతో పాటు, నాణ్యత లేని సర్జికల్ ఇంప్లాంట్ల వినియోగం, మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు కొనుగోళ్లు చేసి ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం కలిగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో నమోదైన విజిలెన్స్ కేసులపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదుదారు కోరినట్లు తెలుస్తోంది.

ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే డాక్టర్ గుడారు జగదీష్‌కు స్విమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ డైరెక్టర్ కమ్ వైస్‌ ఛాన్సలర్ అదనపు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌ఎంసీ, స్విమ్స్ నిబంధనలకు అనుగుణంగానే ఈ నియామకం జరిగిందా? లేక నిబంధనలను పక్కనపెట్టి నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలకు టీటీడీ స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment