మారికవలసలోని ఏకైక ఇంగ్లీష్ మీడియం బాలుర గురుకుల పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ, ఆదివాసీ సంఘాలు చేపట్టిన పోరాటం ఫలించింది. తీవ్ర ఆందోళనలు, హెచ్చరికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గి మారికవలస గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఐటీడీఏ పీఓ, జిల్లా ఎస్పీ స్వయంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో వివాదానికి తెరపడింది.
పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ నాయకులు నిరసనలు కొనసాగించారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీతో పాటు ఆదివాసీ సంఘాలు తొలి నుండి అండగా నిలిచాయి. పాఠశాల కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సీఎం చంద్రబాబు అరకు పర్యటనను అడ్డుకుంటామని తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారులు హామీ ఇచ్చిన అనంతరం అల్లూరి జిల్లా నుంచి విద్యార్థులను బస్సుల్లో తిరిగి మారికవలసకు తరలించారు. మారికవలస పాఠశాల యథావిధిగా కొనసాగుతుందని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పోరాటాలు ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కులు, స్టేడియాల్లో వాకింగ్ చేసే వారిపై ప్రతిపాదించిన ‘వాకింగ్ ట్యాక్స్’ అంశంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, పంచదార్ల కొండ మైనింగ్ వ్యవహారంలో ప్రతిపక్ష పోరాటం తర్వాత ప్రభుత్వం వెనకడుగు వేయడం వంటి పరిణామాలను వారు గుర్తుచేస్తున్నారు.
తాజాగా మారికవలస గురుకుల పాఠశాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం ద్వారా అసంబద్ధ నిర్ణయాలపై ప్రజా ఉద్యమాలు, ప్రతిపక్ష పోరాటాలు ఎంతటి ప్రభావం చూపగలవో మరోసారి స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.





