---Advertisement---

సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగులు.

August 28, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి (APJAC Amaravati) మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ(PRC), ఐఆర్(IR), డీఏతో(DA) పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర ఆర్థిక అంశాల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 26 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 26 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

మొదటి దశ ఉద్యమం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఆగస్టు 31న జిల్లాల కలెక్టర్లకు పీజీఆర్ఎస్‌లో(PGRS) వందలాది మంది ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసులను అందజేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ‘సీఎం సార్.. మా డబ్బులు మాకు ఇవ్వండి’ (CM Sir… Give Us Our Money) అనే నినాదంతో కూడిన ఫోటోలను వాట్సాప్ డీపీగా పెట్టి ప్రచారం చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు (Black Badges) ధరించి నిరసన తెలపనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జిల్లాల్లోని అన్ని ఉద్యోగ సంఘాలకు కరపత్రాలు పంపిణీ చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆహ్వానించనున్నారు. సెప్టెంబర్ 3, 5 తేదీల్లో కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల (RDO Offices) వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు (Round Table Meetings) ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.

రెండో దశ ఉద్యమం సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు కొనసాగనుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు ‘వర్క్ టు రూల్’ (Work to Rule) ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. ఉద్యోగుల బకాయిలు, పీఆర్ఎస్, ఐఆర్, డీఏ సమస్యలపై సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు సోషల్ మీడియా ద్వారా డీపీలు, ఫోటోలు, రీల్స్‌తో విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయనున్నారు. సెప్టెంబర్ 17న నల్ల కండువాలు ధరించి ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో మానవహారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ‘మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ఏపీజేఏసీ అమరావతి నిర్ణయించింది. ఈ దశలో కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమాన్ని మూడో దశకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 26 తర్వాత రెండు మల్టీ జోన్ స్థాయి సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అవసరమైతే సహాయ నిరాకరణ, రిలే నిరాహార దీక్షలు, ‘ఛలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమంతో పాటు నిరవధిక సమ్మెకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తుందా? లేక ఉద్యోగ సంఘాల పోరాటం రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతుందా? అనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment