---Advertisement---

తిరుపతికి దక్కిన నైలెట్‌కూ ఎసరు? అమరావతి వైపు మరో కీలక సంస్థ!

August 29, 2026

Summarize with AI

---Advertisement---

రాయలసీమ అభివృద్ధికి కేటాయించిన ప్రతిష్టాత్మక సంస్థలను ఒక్కొక్కటిగా అమరావతి వైపు మళ్లిస్తున్నారనే విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన నైలెట్‌ సంస్థను అమరావతికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రాయలసీమకు చెందిన విద్యా, వైద్య, సాంకేతిక సంస్థలను తరలించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను మరింత పెంచుతున్నారని ఆయన ఆరోపించారు.

తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం గతంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలిసి కృషి చేశామని ఎంపీ గురుమూర్తి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చి తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. ఇటీవల కూడా కేంద్ర మంత్రులను కలిసి నైలెట్‌కు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరగా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు.

అలాంటి ప్రతిష్టాత్మక సంస్థను ఇప్పుడు తిరుపతి నుంచి అమరావతికి తరలించేందుకు భూములు కేటాయించడం దుర్మార్గమైన నిర్ణయమని గురుమూర్తి మండిపడ్డారు. రాయలసీమలో పుట్టి, ఇక్కడే చదువుకుని, ఇదే ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాలకే విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాయలసీమ విద్యార్థులు, యువత భవిష్యత్‌ను దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా, వైద్య సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు అవకాశాలు కల్పించాల్సిన సమయంలో, అన్ని సంస్థలను అమరావతి ప్రాంతంలోనే కేంద్రీకరించడం వల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నప్పటికీ, మరిన్ని అత్యున్నత విద్యా అవకాశాలను కల్పించాల్సిన ప్రాంతం నుంచి నైలెట్ వంటి సంస్థను తరలించడం యువతకు నష్టమేనని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా ప్రశ్నిస్తామని గురుమూర్తి తెలిపారు.

ఇప్పటికే రాయలసీమకు సంబంధించి పలు కీలక సంస్థలు, ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతి ప్రాంతానికి తరలించే ప్రతిపాదన, రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ మంగళగిరికి వెళ్లడం, కర్నూలు హైకోర్టు అంశం, వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో ప్రతిపాదించిన రూ.250 కోట్ల ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని అమరావతికి తరలించే నిర్ణయం వంటి పరిణామాలపై ఇప్పటికే రాయలసీమ వాసుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి నైలెట్‌ను కూడా అమరావతికి తరలించే ప్రయత్నాలపై కొత్త వివాదం చెలరేగింది. అభివృద్ధి వికేంద్రీకరణకు బదులు అన్ని కీలక సంస్థలను ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం రాయలసీమ భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment