తెలంగాణలో (Telangana) వర్షాలు కొనసాగనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) వెల్లడించింది. దీంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.
జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ వాతావరణ నిపుణుడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.








