సంగారెడ్డి (Sangareddy) జిల్లా పెద్దాపూర్(Peddapur) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Zilla Parishad High School) ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) ఘటన కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం (Midday Meal) చేసిన అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ కూడా అనారోగ్యానికి గురయ్యారు.
మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురు విద్యార్థులు(Students), ఉపాధ్యాయులకు (Teachers) తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్‌ను చికిత్స కోసం సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కాగా, వైస్ ప్రిన్సిపాల్ (Vice Principal) వెంకటేష్ (Venkatesh) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా అందించిన ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.








